Telangana inter exams : సాధారణంగా వార్షిక పరీక్షలు జరుగుతున్నప్పుడు విద్యార్థులు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో వారికి దేనిమీద ధ్యాస ఉండదు. పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి? పరీక్ష ఎలా రాయాలి? మెరుగైన మార్కులు ఎలా సాధించాలి? అనే వాటి మీదే వారి దృష్టి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో నిమిషం నిబంధన పేరుతో ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది. అలా నిమిషం నిబంధన వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో హాజరు కాలేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అటు ఇంటర్మీడియట్ బోర్డుపై, ఇటు ప్రభుత్వంపై తల్లిదండ్రుల నుంచి సామాజికవేత్తల దాకా విమర్శలు చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న ఇంటర్మీడియట్ బోర్డ్ లెంపలేసుకుంది. ఒక్కసారిగా ఆ నిమిషం నిబంధన ఎత్తివేస్తూ శుక్రవారం సాయంత్రం ప్రకటన చేసింది.
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒకవేళ ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. అంతేకాదు గతంలో ఉన్న ఒక్క నిమిషం నిబంధన కూడా సడలించారు. తాజా నిబంధనల ప్రకారం ఉదయం 8:45 నిమిషాల కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఐదు నిమిషాల పాటు ఆలస్యమైనప్పటికీ పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతిస్తామని ప్రకటించారు. వివిధ కారణాల వల్ల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతించాలని ఇంటర్ అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, ఇతర సిబ్బందికి సూచించారు.
గతంలో ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండేది. దానివల్ల చాలామంది విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడం… పరీక్ష రాలేకపోవడం వల్ల ఆత్మ న్యూనతకు గురయ్యేవారు. కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయామనే అపరాధ భావంతో ఆత్మహత్యల వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధనకు ఇంటర్ బోర్డు సడలింపు ఇచ్చింది. అంతేకాదు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని ప్రకటించింది. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కాదు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు బుద్ధి తెచ్చుకున్నందుకు ధన్యవాదాలు పలువురు విశ్లేషకులు అంటున్నారు.