Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన మీద పట్టు సాధిస్తున్నారు. మంత్రుల మీద కూడా పై చేయి సాధిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలను చెడుగుడు ఆడేస్తున్నారు. కేటీఆర్.. హరీష్ రావుకు ఏకకాలంలో సమాధానాలు చెబుతున్నారు. అధిష్టానం వద్ద కూడా తన పట్టును నిరూపించుకుంటున్నారు. మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తేరుకున్నారు. గులాబీ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ.. స్వపక్షంలో ఎంత ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి వెనకడుగు వేయడం లేదు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ ఆలయ నిర్మాణాన్ని మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఓంకారేశ్వర స్వామి ఆలయం సమీపంలో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని ఎనిమిది ఎకరాలలో 700 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్నారు. ఆలయం పై భాగంలో 100 అడుగులకు పైగా ఎత్తుతో గాలిగోపురాన్ని నిర్మించబోతున్నారు. మూసీ నది మధ్యలో ఏర్పాటు చేసే దీవిలో 100 అడుగుల ఎత్తు ఉన్న శివుడి విగ్రహాన్ని నిర్మించబోతున్నారు.
ఆ కేసులు ఎవరివి
ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. ఈ సందర్భంగా మూసి ప్రక్షాళన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. ఈ క్రతువులో ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఏ కరువు పెట్టారు. ముఖ్యంగా ఎన్జీటీలో కేసులు వేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “అక్కా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు అనుభవించావు కదా.. రాజకీయంగా ఉన్నతిని సాధించావు కదా.. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయావు. ఇప్పుడు ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నావు. పైగా కేసులు వేస్తున్నారు. దయచేసి మీ కుమారుడు వేస్తున్న కేసులని వాపస్ తీసుకోమని చెప్పు అక్క” అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ ప్రజాప్రతినిధి ఎవరో.. నేపథ్యం ఏమిటో చెప్పకుండానే రేవంత్ రెడ్డి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గులాబీ పార్టీలో చేరిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు ఈ కేసులు వేస్తున్నట్టు అక్కడ గుసగుసలు వినిపించాయి. అయితే చాలామంది మాత్రం రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రముఖమైన నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యే అని చర్చించుకున్నారు. ఆమె కుమారుడు ప్రతిపక్ష పార్టీ లో కీలక నాయకుడికి అత్యంత దగ్గరైన వ్యక్తి అని.. అందువల్ల కేసులు వేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరిగింది. దీనిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసినప్పటికీ.. వాటిని మీడియాలో రాకుండా జాగ్రత్త పడ్డట్టు సమాచారం.