Revanth Reddy two-year journey: రేవంత్‌రెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. పదేళ్ల తర్వాత ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అన్నివర్గాలను కలుపుకుపోయారు. వ్యతిరేక వర్గీయులు కూడా రేవంత్‌తో కలిసి పనిచేయక తప్పని పరిస్థితి కల్పించారు. ఇలా చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్‌ను కదనరంగంలో పరిగెత్తించి.. విజయ తీరం చేర్చారు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌లో అసమ్మతి లేకుండా బాధ్యతలు నిర్వహస్తున్నారు.
2023 డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్‌కు చారిత్రక విజయాన్ని తెచ్చాయి.ఈ రోజు రేవంత్ రెడ్డి పోరాటయోధుడి నుంచి విజేతగా మారారు, పార్టీకి 64 స్థానాలు సాధించారు. రెండేళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా మరింత బలపడ్డారు.
రాజకీయ ప్రయాణం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్, బీఆర్‌ఎస్‌పై దృష్టి పెట్టారు. కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ప్రజల్లో ఆదరణ పొందారు. కేసీఆర్ ప్రత్యర్థిగా ఎదిగి, పార్టీ రీఆర్గనైజేషన్‌కు దారితీశారు. అప్పుడే బలపడుతున్న బీజేపీని వెనక్కి నెట్టి.. రేసులో పార్టీని ముందుకు తీసుకువచ్చారు. ఆరు నెలల్లో మొత్తం మార్చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ పోటీలో కాంగ్రెస్ గెలుపు ఆకాంక్షను రేవంత్ నాయకత్వం పెంచింది. ఈ మలుపు రాజకీయ శక్తుల పునర్వ్యవస్థీకరణకు కారణమైంది.
రెండేళ్లలో సక్సెస్‌ఫుల్‌గా..
ఇక రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి కూడా రెండేళ్లు కావస్తోంది. సీఎంగా కూడా ఆయన సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణం సాగిస్తున్నారు. నిధుల కొరత ఉన్నా.. పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా.. హామీలు నెరవేర్చకపోయినా.. పెద్దగా వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ఇక పార్టీలోనూ అంతర్గత కలహాలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌కు కొత్త ఊపు తెచ్చింది.
రేవంత్ లేకుండా 2023లో కాంగ్రెస్ విజయం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండేళ్లలో ఆయన నాయకత్వం పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మైలురాయిగా నిలిచింది.