https://oktelugu.com/

Telangana New Secretariat : ఏడంతస్తుల మేడ.. అయిననూ లభించదు సీఎం కేసీఆర్ జాడ

ఈ తాత్కాలిక సచివాలయానికి కూడా ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదు. ఇటీవల కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. గతంలో మాదిరిగా ఇందులోకి ప్రజలను రానివ్వడం లేదు

Written By:
  • Rocky
  • , Updated On : June 8, 2023 / 09:06 AM IST
    Follow us on

    Telangana New Secretariat : 1000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ నిర్మించారు. దాని చుట్టూ ఇనుప కంచె వేయించారు. ముఖ్యమంత్రి ఇష్టముండి పిలిస్తే తప్ప అందులోకి ఇతరులు వెళ్లే అవకాశం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇంతే. ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోక, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందక.. అటు నుంచి అటే వెళ్ళిపోయిన వారు ఎంతోమంది. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఆ జాబితా లెక్కేస్తే ఒక పుస్తకమే రాయచ్చు. ఇక ప్రగతి భవన్ చరిత్ర ఇలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన సచివాలయం.. వాస్తు దోషం పేరుతో అంతటి కరోనా సమయంలో నేలమట్టమయింది. గత ఆనవాళ్లను ఒక్కసారిగా చరిత్ర గర్భంలో కలిపేసుకుంది. ఆ స్థలంలో వందల కోట్లతో ఏడంతస్తులు, 7,80,000 అడుగుల విస్తీర్ణం, 265 అడుగుల ఎత్తు తో శ్వేత వర్ణంతో సచివాలయం నిర్మితమైంది. దీనిని మహా గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మా అంతటి నిర్మాణ కౌశలం ఇంకెవరికి ఉందని ప్రశ్నించింది. ఆ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి దర్శన భాగ్యం సామాన్య మానవులకు కలగలేదు. పోనీ ఈ కొత్త అంబేద్కర్ సచివాలయంలోనైనా సామాన్యులకు ముఖ్యమంత్రి ని కలిసే అవకాశం దక్కుతోందా అంటే? దానికి నో అనే సమాధానమే వస్తోంది. బయట ప్రచారం కోసం అంబేద్కర్ అని పేరు పెట్టినప్పటికీ.. ఆ సచివాలయంలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి సంబంధించిన నిబంధనలు అమలు కావు. అంతేకాదు ముఖ్యమంత్రిని కలుసుకొని, తమ సమస్యలు చెప్పుకునేందుకు అక్కడి నియమాలు ఒప్పుకోవు.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఆ ఆనవాయితీ

    సమస్య తీవ్రతను బట్టి సామాన్య ప్రజల నుంచి ఎమ్మెల్యేల వరకు ముఖ్యమంత్రిని కలుసుకునే ఆనవాయితీ గతంలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాదర్బార్ పేరుతో ముఖ్యమంత్రులు నేరుగా ప్రజలు కలుసుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించేవారు. ఉదయం అయితే క్యాంప్ కార్యాలయంలో, సాయంత్రమైతే ఈ దర్బార్ నిర్వహించేవారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రజా దర్బార్ ప్రజలకు మరింత చేరువైంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రగతి భవన్ ప్రాంగణంలోనే అప్పట్లో ఉదయం ప్రజా దర్బార్ సాగేది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించుకునేవారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా కోరేవారు. వారి సమస్యలు నేరుగా రాష్ట్రస్థాయిలోని అధికారుల దృష్టికి వెళ్లేవి. సాధారణ ప్రజలతో పాటు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రిని కలుసుకునేవారు. తమ సమస్యలను చెప్పుకుంటే.. అక్కడ ఉండే అధికారులు వెంటనే స్పందించి సదరు సమస్యలపై చర్యలు తీసుకునేవారు.

    అసాధ్యం అయిపోయింది

    తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకోవడం అసాధ్యమైపోయింది. ముఖ్యమంత్రే స్వయంగా పిలిపించుకొని కలుసుకునే అవకాశం ఇస్తే తప్ప ప్రజా ప్రతినిధులు నేరుగా కలిసే అవకాశం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా దాదాపు ఒక్కటే. సాధారణ ప్రజలు ముఖ్యమంత్రిని కలసి తమ ఇబ్బందులు చెప్పుకోవడం కలలో జరగని పనిగా మారింది. దీంతో, నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావడం లేదు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. జిల్లాల్లో గ్రీవెన్స్ డే లో ఇస్తున్న విజ్ఞప్తిలో సింహభాగం ప్రభుత్వం తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న ధరణి గురించే. జిల్లాలో జరిగే ప్రజావాణిలో కలెక్టర్లకు అధికారులు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ అత్యధికంగా అక్కడ పరిష్కారం కావడం లేదు. దీంతో విసిగి వేసారి పోయిన ప్రజలు మా కర్మ ఇంతే అని మిన్నకుంటున్నారు. ధరణి వల్ల తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొంతమంది ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా ఆ స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు.

    విపరీతమైన ఆంక్షలు

    సచివాలయం అనేది ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ లాంటిది. ప్రజల జీవితాలకు సంబంధించి కీలకమైన రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాల నుంచి సెక్షన్ అధికారి వంటి కిందిస్థాయి ఉద్యోగి నిర్ణయాల వరకూ అన్ని అక్కడే జరుగుతాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సచివాలయాన్ని ప్రజలకు ప్రభుత్వ పెద్దలు నిబంధనల పేరుతో దూరం చేశారు. అంతేకాదు వాస్తు పేరిట పాత సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు. కొత్త సచివాలయానికి ప్రజలను రానివ్వడం లేదు. దీంతో ప్రజలకు దూరంగా పాలన మందిరాన్ని ఉంచారని చర్చ జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిది సంవత్సరాలలో సచివాలయంలో పూర్తిస్థాయి పాలన జరగలేదంటే అతిశయోక్తి కాదు. మొదటిసారి భారత రాష్ట్ర సమితి కొన్ని సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చారు. తర్వాత రావడం మానేశారు. సమీక్షలు, సమావేశాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే జరిగేవి. చివరికి క్యాబినెట్ సమావేశాలను కూడా అక్కడే నిర్వహించేవారు.

    ప్రజాస్వామ్య పద్ధతులకు చరమగీతం

    కొత్త భవన నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చేశారు. కొంతకాలం పాటు బూర్గుల రామకృష్ణ భవన్లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేశారు. అక్కడ మంత్రులు, కార్యదర్శుల వంటి వారు ఉండేవారు. ఈ తాత్కాలిక సచివాలయానికి కూడా ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదు. ఇటీవల కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. గతంలో మాదిరిగా ఇందులోకి ప్రజలను రానివ్వడం లేదు. సాధారణంగా జిల్లా స్థాయిలో పరిష్కారం దక్కని సమస్యలపై ప్రజలు నేరుగా సచివాలయానికి వచ్చి, అధికారుల దృష్టికి తీసుకువచ్చేవారు. సదరు సమస్యపై కొంత పరిష్కారం లభించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కొంతసేపు విజిటర్స్ ను అనుమతిస్తున్నారు. కానీ, పాస్ లు, ఐడి కార్డులు వంటి రకరకాల ఆంక్షలు పెట్టారు. అంతేనా.. అసెంబ్లీలో, సచివాలయంలో, క్యాంపు కార్యాలయంలో అన్ని పార్టీల నేతలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరే వీలుండేది. ఇప్పుడు ఇటువంటి ప్రజాస్వామ్య పద్ధతులకు దాదాపుగా చరమగీతం పాడేశారు. చివరికి కొత్త సచివాలయంలోకి ఎమ్మెల్యేలకు కూడా ప్రవేశం లేకుండా చేశారు. ఇక విపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.