Telangana BJP: తెలంగాణలో మొన్నటి వరకు బలమైన పార్టీగా ఉన్న బీజేపీలో కొన్ని మార్పులు చేయడంతో కకావికలంగా మారినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీలోనూ గ్రూపు విభేదాలు ఉన్నాయని తాజా పరిస్థితులను చూస్తే అర్థమైంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అనూహ్యంగా తప్పించడంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో తెలంగాణలో ఒకే ఒక్క సీటును గెల్చుకున్న ఆ పార్టీకి మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నిక ద్వారా విజయం సాధించడానికి బండి సంజయ్ నే కారణమని ఆ పార్టీలోని ఓ వర్గం అంటోంది.ఈ క్రమంలో పార్టీని గాడిలోకి పెట్టిన బండి సంజయ్ పై అందులోనే మరో వర్గం వ్యతిరేకిస్తుంది. తాజాగా ఈ పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడంతో ఈ విషయం బట్టబయలైంది. పార్టీలో రెండు వర్గాలుగా చీలి బండి సంజయ్ మార్పుపై ఒక వర్గం విమర్శలు చేస్తుండగా.. మరో వర్గం మాత్రం కిషన్ రెడ్డి అధ్యక్షుడు కావడంతో సంబరాలు చేసుకుంటోంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని బీజేపీ నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఊహించుకున్నారు. మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో గ్రూపు విభేదాలు ఉండడంతో ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో పాటు రాష్ట్రంలో పార్టీపై వీరాభిమాని ఉన్న బండి సంజయ్ కి పగ్గాలు అప్పజెప్పడంతో దాదాపు అధికారంలోకి వస్తుందని నమ్మారు. కానీ ఇంతలోనే ఈ పార్టీలోనూ గ్రూపు విభేదాలు ఉన్నాయన్న విషయం కొన్ని రోజులుగా అర్థమైంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా నియామకం అయినప్పటి నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. కానీ యూత్ లో మాత్రం విపరీత ఫాలోయింగ్ వచ్చింది. బండి సంజయ్ అండతో కొందరు పర్సనల్ గా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పార్టీని అభివృద్ధి చేశారు.
అయితే బీజేపీలో గ్రూపు విభేదాలున్నాయని, కాంగ్రెస్ సహా ఇతర పార్టీ నాయకులు విమర్శించారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం తామంతా ఒక్కటే అని పైపైకి చెప్పుకుంటూ వచ్చారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు ఎప్పటి నుంచో గ్రూపు విభేదాలు పార్టీలో కొనసాగుతున్నట్లు అర్థమైంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా బండి సంజయ్ ని అధ్యక్షపదవి నుంచి మారుస్తారన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలు కలగజేసుకొని అధ్యక్షుడి మార్పు ఉండదని చెప్పారు. కానీ అనూహ్యంగా ఈటల రాజేందర్ వంటి నాయకులను ఢిల్లీకి పిలిపించుకున్నారు. పరోక్షంగా అధ్యక్షుడి మార్పు ఉంటుందని చెప్పడంతో ఆ పార్టీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ ని తప్పించడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. అయితే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలినట్లు తెలస్తోంది. బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడంతో బండి వర్గం విమర్శిస్తుండగా.. ఈటల రాజేందర్ వర్గం మాత్రం సంబరాలు చేసుకుంటోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కొత్త నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.