BRS Warangal MP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బీఆర్‌ఎస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవలే ఎంపీ టికెట్ కాదని కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ వరంగల్ నుంచి పోటీచేసే కొత్త అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలో కేసీఆర్‌కు కడియం ప్రత్యర్థి గుర్తొచ్చారు. వెంటనే ఆయనకు ఫామ్‌హౌస్ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు వరంగల్ జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ పేరును కూడా బీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది.
తాటికొండ, సుధీర్ పేర్లు పరిశీలన..
తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి బద్ధ శత్రువు అయిన తాటికొండ రాజయ్యను లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. ఈమేరకే ఆయనను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు పిలిపించినట్లు తెలిసింది. అయితే తాటికొండపై జిల్లాలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సుధీర్‌కుమార్ పేరును పరిశీలించారు. పార్టీ వరంగల్ జిల్లా నాయకులతో రెండు పేర్లపై చర్చించారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ‘తాటికొండ’
ఇదిలా ఉండగా తాటికొండ రాజయ్య రెండు నెలల క్రితమే బీఆర్‌ఎస్‌ను వీడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోగా, ఇటీవల లోక్‌సభ టికెట్ కూడా కడియం కావ్యకు ఖరారు చేశారు. దీంతో పార్టీలో తనకు గుర్తింప లేదని మనస్తాపం చెందిన రాజయ్య ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే కడియం కావ్య సడెన్‌గా పోటీ నుంచి తప్పుకోవడం, కాంగ్రెస్‌లో చేరడం.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రాజయ్యకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో గులాబీ బాస్ నుంచి మళ్లీ పిలుపు రావడంతో వెంటనే రెక్కలు కట్టుకుని ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో వాలిపోయారు. ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ఓకే అన్నట్లు సమాచారం.
సుధీర్‌కుమార్ ఖరారు..
ఇదిలా ఉండగా, శుక్రవారం(ఏప్రిల్ 12న) సాయంత్రం వరకు రెండు పేర్లపై సమాలోచనలు చేసిన కేసీఆర్ చివరకు మాదిగ సామాజికవర్గానికే చెందిన సుధీర్‌కుమార్ పేరు ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. దీంతో రాజయ్యకు మరోమారు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యే టికెట్‌పై రాజయ్యను చివరి వరకు ఊరించి ఉసూరుమనిపించారు. తాజాగా ఎంపీ టికెట్ కోసం ఫాంహౌస్‌కు పిలిపించి హ్యాండ్ ఇచ్చారు.
మొత్తంగా వరంగల్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి అభ‍్యర్థులిద్దరూ ఇటీవలే బీఆర్‌ఎస్‌ను వీడిన వారు కావడం గమనార్హం. బీజేపీ నుంచి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. దీంతో బీఆర్‌ఎస్ ఇప్పుడు సుధీర్‌కుమార్‌ను ప్రకటించారు.