Stray Dog Issue In Telangana: తెలంగాణలో కొన్ని రోజులు వీధికుక్కల అంశం వార్తల్లో నిలుస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు తమను ఎన్నికల్లో గెలిపిస్తే కుక్కలు, కోతులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు కొందరు కోతులను పట్టేవారిని పిలిపించి వాటిని పట్టించి అటవుల్లో విదిలేస్తున్నారు. ఇక కొందరు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కలకు విషం పెట్టి చంపేస్తున్నారు. దీనిపై ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, టీవీ యాంకర్, నటి రష్మీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో జంతు సంరక్షణ సంస్థలు గ్రామ పంచాయతీ నాయకులపై ఆరోపణలు చేశాయి. పోలీసులు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మాచారెడ్డి ప్రాంతంలో 244 మరణాలు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలో భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట్ గ్రామాల్లో 244 కుక్కలు చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈమేరకు స్టేట్ యానిమల్ ఫౌండేషన్ నుంచి ఏ.గౌతమ్ జనవరి 12న ఫిర్యాదు చేశారు. దీంతో పశు వైద్యులు పోస్ట్‌మార్టం చేసి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. సర్పంచుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
శాయంపేట, ఆరేపల్లిలో అరెస్టులు..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 110 కుక్కల మరణాలకు కారణమని తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచులు, కార్యదర్శులు ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారు గౌతమ్ ప్రకారం, స్థానికుల సహకారంతో ఇంజెక్షన్లు ఇచ్చి చంపారు. ఫోరెన్సిక్ రిపోర్టుల అంచనా వేస్తున్నారు.
ధర్మపురి, యాచారం ఘటనలు
ధర్మపురి మున్సిపాలిటీలో 40 కుక్కలు ఇంజెక్షన్లతో చంపబడ్డాయని ఫిర్యాదు అందింది. మున్సిపల్ సిబ్బంది పనే అనే ఆరోపణలు ఉన్నాయి. యాచారం గ్రామంలో వందల మంది కుక్కలను ట్రాక్టర్లో తరలి పూడ్చారు. ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులు పని చేశారని స్థానికులు చెబుతున్నారు. రెండు కేసుల్లోనూ విచారణ లేగా ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచులకు అండగా గ్రామస్తులు..
ఆరేపల్లి సర్పంచ్ కుమారుడు రాజు మాట్లాడుతూ తాము పిచ్చి కుక్కలు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపాడు. వాటి వ్యాధులు (చర్మ రోగాలు, ఎలర్జీ) పిల్లలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నాడు. ఎన్నికల వాగ్దానాల ప్రకారం చర్య తీసుకున్నామని ఒప్పుకున్నాడు. స్థానికుడు విజయ్ గ్రామస్తుల మద్దతుతో ఈ చర్య అవసరమని సమర్థించాడు. రోగ వ్యాప్తి ఆంక్షలు పెరిగాయని చెప్పారు.
కేసులు బీఎన్ఎస్ సెక్షన్ 325, జంతు క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్ 11 కింద నమోదయ్యాయి. తెలంగాణలో 2022–2024 మధ్య కుక్క కాటు కేసులు 92,924 నుంచి 1,21,997కి పెరిగాయి. రేబీస్ మరణాలు లేకపోయినా, సమస్య తీవ్రమైంది. అయితే జంతు ప్రేమికులు చట్ట ఉల్లంఘనలకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.