Sri Rama Navami : ఎన్ని కారణాలైన గాని.. సీత అంటే మాయమ్మ.. రాముడు అంటే మా తండ్రి.. అలా చెప్పుకునే దగ్గర బాంధవ్యం ఉంది కాబట్టే భద్రాచలం క్షేత్రం వెనుక అంతటి ఇతిహాసం పుట్టింది. ఎంతోమందికి రాముడు దర్శన భాగ్యం కలిగించింది. ఉత్తర భారతంలో అయోధ్యకు ఎంతటి పేరు ఉందో.. ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్టకు ఎంత చరిత్ర ఉందో.. భద్రాచలంలో కొలువైవున్న రాముడు క్షేత్రానికి కూడా అంతే స్థల పురాణం ఉంది. ఆ చరిత్ర మొత్తం కలిపితే రామాయణం అవుతుంది. అందుకే రాముడు ఇప్పటికీ అచ్చ తెలుగు యువకుడు.. సీతమ్మ 16 అణాల తెలుగు కొమ్మ.. మాటతప్పని కొడుకుగా.. మడమ తప్పని వ్యక్తిగా.. ధర్మానికి అండగా నిలిచిన మూర్తిగా.. అన్యాయానికి రక్షణగా నిలబడిన దేవుడిగా.. రాముడు చరితార్థుడు.. గుణవతిగా.. సౌందర్యవతిగా.. శీలవతిగా.. అన్నపూర్ణగా.. భర్త మనసు ఎరిగి నడుచుకున్న ఇల్లాలుగా సీతమ్మ ధన్యురాలు.. అందుకే వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా భద్రాచలం నిలిచింది. వారి వనవాసానికి పర్ణశాల వేదిక అయింది. కాలాలు మారాయి.. యుగాలు గడిచాయి. అయినప్పటికీ భద్రగిరిలో రామచంద్రుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కళ్యాణం రోజున అద్వితీయంగా వేడుకలు జరుపుకుంటున్నాడు. రాముడంటే దేవుడే కాదు.. మనిషి ఎలా ఉండాలో నిరూపించినవాడు. ఎలా ఉండకూడదో చూపించినవాడు. అందుకే తెలుగు వాళ్లకు.. సమస్త భారతీయులకు రాముడంటే ఓ అంతరాత్మ.. రాముడు అంటే ఓ గౌరవం.. రాముడంటే నిలువెత్తు మనిషి తనానికి నిదర్శనం.
Also Read : బాలరాముడికి సూర్య తిలకం.. అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం!
ఇదీ భద్రాచలం స్థలపురాణం విశిష్టత
మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు.. శ్రీరామచంద్రుడిని విశేషంగా పూజించేవాడు. అతడి పూజలకు మెచ్చిన శ్రీరాముడు వరం ఇచ్చాడు..ఆ వరం ప్రకారం సీతలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరాముడు భద్రాచలంలో వెలిశాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడిని భక్తులు వైకుంఠ రాముడిగా.. చతుర్భుజ రాముడిగా.. భద్రగిరి నారాయణుడిగా పిలుచుకుంటారు.. ఇక భద్రాచలం క్షేత్రానికి మరో చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోని బద్రి రెడ్డిపాలెం అనే గ్రామం ఉండేది. అక్కడ పోకల దమ్మక్క అనే మహిళ రాముడిని విశేషంగా కొలుస్తూ ఉండేది. అతడి పూజలకు మెచ్చిన రాముడు ఆమెకు కలలో ఒకరోజు వచ్చి.. తాను భద్రగిరి లో ఉన్నానని.. తనను మిగతా భక్తులు కూడా దర్శించేలాగా ఏర్పాట్లు చేయాలని సూచించాడు. అయితే ఈ విషయాన్ని దమ్మక్క గ్రామ పెద్దలకు తెలియజేసింది. ఆ తర్వాత వారంతా కలిసి గుట్టపైకి వెళ్లి శ్రీరాముడిని గుర్తించారు. అక్కడ పందిరి వేసి ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేవారు. ఇక ఆ తర్వాత రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడు ఉన్న బ్రహ్మాండ పై కోవెల నిర్మించారు. రామదాసు ది నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నకు అతడు మేనల్లుడు. వారి సహకారంతో పాల్వంచ తాలూకా తహసీల్దార్ గా రామదాసు నియమితులవుతాడు. ఆ తర్వాత భద్రాచలంలో రాముడు గురించి తెలుసుకొని.. భక్తుడిగా మారిపోతాడు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను రాముడి ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తాడు. ఆ రోజుల్లో రాముడి ఆలయ నిర్మాణానికి ఆరు లక్షల మొహరీలు ఖర్చు చేస్తాడు. ఈ విషయం నవాబుతానిషా కు ఆగ్రహాన్ని తెప్పించడంతో.. రామదాసును జైల్లో వేస్తాడు. సుమారు 12 సంవత్సరాల పాటు రామదాసు జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్నప్పుడు వందల కొద్ది కీర్తనలను రాముడికి మొరపెట్టుకుంటూ రామదాసు ఆలపించాడు. అప్పట్లో రాముడు మారువేషంలో వచ్చి తానిషా ప్రభువుకు డబ్బు కట్టి రామదాసును విముక్తుడిని చేస్తాడు. ఇప్పటికీ రామాలయంలో రామదాసు చేయించిన ఆభరణాలు ఉన్నాయి. శాసనాలు.. పరికరాలు నేటికీ అక్కడ కనిపిస్తాయి.
Also Read : సీతారాముల కల్యాణం.. నిజంగా ఎక్కడ జరిగిందో తెలుసా.. చారిత్రక సత్యం ఇదీ!