Telangana Survey: మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ఇటీవలే ఈసీ ప్రకటించింది. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహిస్తూ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే టైమ్స్‌నౌ, ఇండియా టుడేతోపాటు, పలు సంస్థలు సర్వే చేశాయి. తాజాగా మరో కొత్త సర్వే బయటకు వచ్చింది. పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సంస్థ తాజాగా తెలంగాణలో నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాను ప్రకటించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు అనే అభిప్రాయాలను సేకరించింది.
ఎవరికి ఎన్ని సీట్లంటే..
పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలోన 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 10 గెలుస్తుందని వెల్లడించింది. 2019లో 9 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్ 3 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక హైదరాబాద్ సీటు ఎంఐఎం ఖాతాలోకే వెళ్తుందని ప్రకటించింది.
కాంగ్రెస్‌కు మొగ్గు..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపుతారని సంస్థ తన సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. అధికార పార్టీ అనే అంశం కాంగ్రెస్‌కు బాగా కలిసి వస్తుందని సర్వే ఫలితాల ఆధారంగా అంచనా వేసినట్లు పేర్కొంది. మరోవైపు ఆరు గ్యారంటీలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపుతోపాటు మార్చి నుంచి అమలు చేసే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ అంశాలు కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్ అని వివరించింది.
బీజేపీకి మోదీ ట్యాగ్‌లైన్..
ఇక బీజేపీకి వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ట్యాగ్‌లైన్ బాగా ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. అభ్యర్థులను కాకుండా మోదీని చూసే ఓటేస్తామని చాలా మంది సర్వేలో వెల్లడించారని తెలిపింది. కేంద్రంలో మోదీ సర్కార్ ఉండాలన్న భావన తెలంగాణలోనూ గట్టిగానే ఉన్నట్లు పేర్కొంది. ఇక బీఆర్‌ఎస్‌కు మాత్రం ఎలాంటి ట్యాగ్‌లైన్ కనబడడం లేదు. ఆ పార్టీ భారీగా నష్టపోతుందని సర్వేలో గుర్తించింది. ఈ సర్వే ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య నిర్వహించినట్లు సంస్థ ప్రకటించింది.
ఓట్ల శాతం ఇలా..
ఇక ఓట్ల శాతం పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బీజేపీకి 23 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ ప్రకటించింది. బీఆర్‌ఎస్ 2019తో పోలిస్తే 6 శాతం ఓట్లు నష్టపోతుందని తెలిపింది. ఇక ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మళ్లుతుందని గుర్తించింది. ఇక ప్రధానిగా మోదీ ఉండాలని తెలంగాణలో 34 శాతం మంది కోరుకుంటున్నారు. రాహుల్‌కు 23 శాతం మంది మద్దతు ఇస్తున్నారు. ప్రియాంక గాంధీకి కేవలం 11 శాతం మద్దతు ఉంది. ఇక మమతాబెనర్జీకి 10 శాతం మొగ్గు రూపారు.