Phone Tapping Case: భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగాలు మోపింది. ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ కూడా చాటుమాటుగా విన్నారని.. ఇంటి అల్లుడి ఫోన్ వినడం సిగ్గు మాలిన పని అని కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దూకుడు పెంచింది.
సిపి సజ్జనార్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సజ్జనార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నాయి.
” ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసిఆర్, కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. ఎంతోమంది ఫోన్లను ట్యాప్ చేశారు. చివరికి నా ఫోన్ కూడా వదలలేదు. తన సొంత కూతురు, అల్లుడి ఫోన్ కూడా వదలలేదు. ఎస్ఐబి వ్యవస్థను మొత్తం సొంతానికి వాడుకున్నారు. దానిని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి, అనేకమంది నాయకులనుంచి డబ్బులు వసూలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. వాటిపై అత్యంత లోతుగా దర్యాప్తు నిర్వహించాలని” బండి సంజయ్ పేర్కొన్నారు.
“నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్నో టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. కానీ ఇంతవరకు ఈ కేసు కొనసాగుతూనే ఉంది. విచారణ నిర్వహించే అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా.. పూర్తి స్వేచ్ఛతో పనిచేసే అవకాశం ఇవ్వాలి. ఈ వ్యవహారంలో సూత్రధారుల కుట్రలను మొత్తం బయటపెట్టాలని” బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చివరికి ఈ వ్యవహారంలో కవిత కూడా బాధితురాలు కావడంతో రేవంత్ ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుంది? కెసిఆర్, కేటీఆర్ ను కార్నర్ చేస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.