YS Sharmila: వైఎస్సార్‌టీపీ.. రాజన్న రాజ్యం తెస్తామని రెండేళ్ల క్రితం పుట్టి.. అంతలోనే రాజన్నపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన… జగనన్నపై మనీ లాండరింగ్ కేసులు పెట్టిన కాంగ్రెస్‌లో కలిసిపోయిన పార్టీ. మరి ఇప్పుడు వైఎస్సార్ టీపీ నాయకులు ఎక్కడున్నారు.. ఎలా ప్రచారం చేస్తారన్న సందేహం రావొచ్చు. రాజన్నపై అభిమానంతో తెలంగాణలో వైఎస్.షర్మిల స్థాపించిన వైఎస్సార్ టీపీలో చేరిన అనేక మంది ప్రస్తుతం ఎటూ కాకుండా పోయారు. పార్టీ పెట్టిన షర్మిల మధ్యలోనే కాడెత్తేసి ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయింది. కానీ, తెలంగాణలో ఆమె వెంట నడిచిన నేతలు అటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేరు. తెలంగాణలో ఏ పార్టీవారు చేర్చుకోలేరు. ఇలాంటి పరిస్థితిలో తమను మోసం చేసిన ఆంధ్రాకు వెళ్లిపోయిన షర్మిలపై గుర్రుగా ఉన్నారు. అక్కడ వైఎస్సార్‌కు ద్రోహం చేసిన పార్టీ పగ్గాలు చేపట్టడంపై మరింత ఆగ్రహంగా ఉన్నారు.
ఎన్నికల నుంచి తప్పుకున్న రోజే..
2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని వైఎస్సార్ టీపీ నిర్ణయించడంతోనే చాలా మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం తమ ఆస్తులు అమ్ముకున్నామని, రెండేళ్లు అన్ని పనులు మానుకుని పార్టీ కోసం పనిచేశామని, నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతరుణంలో ఎన్నికల బరినుంచి తప్పుకోవడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రచారం చేస్తామని హెచ్చరించారు. కానీ, తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది. దీంతో వైఎస్సార్ టీపీలో పనిచేసిన కోసం చల్లారలేదు.
ఆంధ్రాలో షర్మిలకు వ్యతిరేకంగా..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. తమను మోసం చేసి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల అక్కడ సొంత అన్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపైనే విమర్శలు చేస్తున్నారు. ఏకవచనంలో మాట్లాడుతున్నారని నొచ్చుకుంటున్నారు. వైఎస్సార్ కుటుంబానికి అభిమానులుగా ఉన్న తెలంగాణ నేతలు షర్మిల తీరు చూసి మరింత రగిలిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టి తమకు అన్యాయం చేసిన షర్మిల, ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో శనివారం సమావేశమైన వైఎస్సార్ అభిమానులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఆమె చెప్పిన మాటలు, ఇక్కడి నేతలకు ఆమో చేసిన ద్రోహం ఆంధ్రా ప్రజలకు వివరించాలని తీర్మానించారు. షర్మిల ఒక నియంత అని, తన నియంత నిర్ణయాలతో తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీలో షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.