Shivadhar Reddy new Telangana DGP: గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని కొంతమంది పెద్దలకు గ్యాంగ్ స్టర్ నయీం నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ పంచాయితీ ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా వెళ్ళింది. అసలే అప్పట్లో కెసిఆర్ మంచి స్వింగ్ మీద ఉన్నాడు. ఇంకేముంది ఆగ మేఘాల మీద ఆదేశాలు వెళ్లిపోయాయి. అంతే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆపరేషన్ మొదలైంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు తగ్గట్టుగానే నయీం కాలగర్భంలో కలిసిపోయాడు.
ఈ ఆపరేషన్ మొత్తం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగింది. ఆపరేషన్ తర్వాత కీలకమైన వివరాలను పోలీసులు సేకరించారు. డంప్ లు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్ డైరీలో అనేక రకాలైన పేర్లు కనిపించాయి. లావాదేవీలు పొందిన వాళ్ల పేర్లు వినిపించాయి. అప్పటి ప్రభుత్వంలో పని చేసిన వారిలో కీలకమైన వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి. మీడియా ద్వారా నయీం ఆగడాలు తెలంగాణ సమాజానికి తెలిశాయి. మీడియా మరింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ దీంట్లో ఏంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఊహించిన విధంగా పరిణామాలు మారిపోయాయి . శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఐజీ పర్సనల్ పోస్ట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత శివధర్ రెడ్డి దాదాపు ఏడు సంవత్సరాల కాలం నరకం చూశారు. ఆయనను ఎవరూ కలవకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. ఈ సమయంలోనే శివధర్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి బాండింగ్ ఏర్పడింది అంటారు. శివధర్ రెడ్డి గురించి రేవంత్ బాగా స్టడీ చేశారని.. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలిశాయని.. ముఖ్యంగా తెలంగాణ వాదం విషయంలో ఉద్దేశాలు ఒకే విధంగా ఉండేవని.. అందువల్లే వారిద్దరు కలిసిపోయారని.. అంటుంటారు.
శివధర్ రెడ్డి స్వస్థలం రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్ద తుండ్ల గ్రామం. 1994 ఐపిఎస్ బ్యాచ్ అధికారి. చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ లో పనిచేశాడు కాబట్టి రేవంత్ రెడ్డికి గట్టి బలం. పైగా ఇన్నాళ్లపాటు సరైన డిజిపి దొరకక రేవంత్ రెడ్డి చాలానే ఇబ్బంది పడ్డాడు. కొన్ని సందర్భాలలో గులాబీ పార్టీ నేతల మాటలు పడాల్సి వచ్చింది. శివధర్ రెడ్డి మావోయిస్టులకు సింహ స్వప్నం లాంటోడు. అప్పట్లో “ఓజీ” మాదిరిగానే చుక్కలు చూపించాడు. ఇతడిని మావోయిస్టులు రక్త పిపాసి అనేవారు అంటే ఏ స్థాయిలో భయ పెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. శివధర్ రెడ్డి గతంలో న్యాయవాదిగా పని చేశాడు. ఇతడు విద్యాబుద్ధులు నేర్చుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో.. ఏ ప్రకారం చూసుకున్నా రేవంత్ రెడ్డిది సరైన ఎంపిక.