Bandla Ganesh : పోలీసులకు బండ్ల గణేష్ కుమారుడి సంచలన ఫిర్యాదు

ఆమె వేధింపులకు తట్టుకోలేక హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 17, 2024 10:42 pm
Follow us on

Bandla Ganesh : వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ మీడియాలో ఉండే సినీ నిర్మాత బండ గణేష్ కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ తనపై దౌర్జన్యానికి దిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బండ్ల గణేష్ కుమారుడి ఫిర్యాదు నేపథ్యంలో అసలు ఏమిటి ఈ కేసు? అతడు ఎందుకు పోలీసులను ఆశ్రయించాడు? అనే ఆసక్తి అందరిలో కలిగింది.. ఇటీవల బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. ఓ వ్యక్తి ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మర్చిపోకముందే బండ్ల గణేష్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అది కూడా ఓ మహిళపై చేయడం ఆసక్తికరంగా మారింది.

నౌహీరా షేక్.. హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. ఆమె బంగారం కుంభకోణానికి పాల్పడిందని అభియోగాలు మోపుతూ ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న ఇంటిని నౌహీరా షేక్ విక్రయించే ప్రయత్నం చేసింది. అదే కాదు ఆ ఇంటి అమ్మకానికి సంబంధించి మూడు కోట్లు తీసుకుంది. ఆమె బాధితుడు బండ్ల గణేష్ కొడుకు కావడం విశేషం. మూడు కోట్లు ఇవ్వడంతో అతడు ఆమె ఇంట్లో ఉంటున్నాడు.. ఇంతవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఐతే నౌహీరా షేక్ కొంతమంది రౌడీలతో బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ ఉంటున్న ఇంటి మీదికి పంపింది. ఇంటిని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నది. దీంతో హీరేష్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హీరేష్ ఫిలింనగర్ లో రోడ్ నెంబర్ 13, సైట్ _2 లోని ప్లాట్ నెంబర్ 15_ఏ లో నౌహీరా షేక్ కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకు ఉంటున్నాడు. కాగా కొంతకాలం తర్వాత ఆ ఇంటిని అమ్ముతానని నౌహీరా షేక్ అతడికి చెప్పింది. ఒప్పందంలో భాగంగా అతడు ఆమెకు మూడు కోట్లు చెల్లించాడు. మిగతా డబ్బు ముట్ట చెప్పే సమయంలో ఆ ఇల్లు ఈడి కేసు పరిధిలో ఉన్నట్టు హీరేష్ కు తెలిసింది. అయితే దీనిపై నౌహీరా షేక్ ను అతడు వివరణ కోరితే ఆమె దాటవేసింది. కాదు మిగతా డబ్బు చెల్లించాలని అతనిపై ఒత్తిడి తెస్తున్నది. ఇంట్లో ఉంటున్న అతనిపై బెదిరింపులకు పాల్పడుతోంది. ఆమె వేధింపులకు తట్టుకోలేక హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తాను జారీ చేసిన చెక్కు బౌన్స్ కావడంతో బండ్ల హీరేష్ తండ్రి బండ్ల గణేష్ మీద పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే.