Telangana Congress : కాంగ్రెస్ అంటేనే కయ్యాల పార్టీ. ఎక్కడా ప్రశాంతంగా ఉండదు. గొడవలు, వర్గపోరు.. ఎవరికి వారు మాట్లాడడం ఆ పార్టీలో చాలా కామన్. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అలకలు, ఆధిపత్య పోరు మధ్య 14 నెలల పాలన పూర్తి చేసుకుంది. బొటాబొటి మెజారిటీ ఉన్న రేవంత్ సర్కార్ బలం పెంచుకునేందుకు 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కానీ, వారు కూడా ప్రభుత్వంతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక మంత్రికి వ్యతిరేకంగా జడ్చర్లలోని ఒక ఫాంహౌస్‌లో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. సుమారు గంటపాటు మత్రి తీరుపై చర్చించారని సమాచారం. మరోమారు కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంకు ఫిర్యాదు..
రహస్య భేటీకి ముందు రోజు పది మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం. మంత్రి తమను పట్టించుకోవడం లేదని వారు సీఎంకు ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే సీఎం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. మరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పాల్గొన ఎమ్మెల్యేలు ఎవరు.. ఏ మంత్రికి వ్యతిరేకంగా వారు సమావేశం అయ్యారు అన్నది మాత్రం తెలియడం లేదు.
నాలుగు నెలలకే కుమ్ములాట..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కుమ్ములాట మొదలైంది. బహిరంగ విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి కొనసాగాయి. వాటినీ సీఎం చక్కదిద్దారు. ఇప్పుడు 14 నెలల తర్వాత మరోమారు అధికార పార్టీలో లుకలుకలు బయట పడ్డాయి. రహస్యంగా ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది.
చాలా మందిలో అసంతృప్తి..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణ జరుగలేదు. రేపు మాపు అంటూనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో పదవులు ఆశిస్తున్న చాలా మంది సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవులు కూడా చాలా వరకు కాళీగా ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా పెద్దగా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ అంశంపై పార్టీలోని మాల, మాదిగ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపాయి. వివేక్ వెంకటస్వామి, సంపత్ మధ్య బహిరంగంగానే మాటల యద్ధం జరుగుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేస్తాయో అన్న టెన్షన్ క్యాడర్‌లో కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ప్రకటన చేసిన రెండు రోజులకే అసమ్మతి సమావేవం వెలుగులోకి రావడంతో కేసీఆర్ కాంగ్రెస్‌ను గట్టిగా కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్న చర్చ మొదలైంది.