Janasena : జనసేన( Jana Sena) బలోపేతం పై నాయకత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల్లో అనూహ్య విజయం సొంతం చేసుకుంది జనసేన. పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. రెండు పార్లమెంట్ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు జనసేనకు ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. త్వరలో నాగబాబు సైతం క్యాబినెట్లో చేరనున్నారు. అయితే పాలనలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే పార్టీకి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. త్వరలో జనసేన ప్లీనరీ కూడా జరగనుంది. ఈ గ్యాప్ లో పార్టీ శ్రేణులతో మమేకం అయ్యేందుకు.. పార్టీ యాక్టివిటీస్ ను పెంచేందుకు నాగబాబు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధపడుతున్నారు. జనాలతో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. తొలిసారిగా పుంగనూరు నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేశారు. మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేయడం అంటే అనూహ్యమే అనుకోవచ్చు.
* నాగబాబు పర్యవేక్షణలో
రాష్ట్రవ్యాప్తంగా నాగబాబు( Nagababu ) పర్యటనలు చేయనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తారు. వీటన్నింటిని నాగబాబు పర్యవేక్షించనున్నారు. ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకోవడం దగ్గర నుంచి.. అన్ని జిల్లాల్లో పార్టీ బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన అంశాలు పార్టీ శ్రేణుల నుంచి సేకరించనున్నారు. ఇకనుంచి నెలలో 15 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని జనసేన ప్రజాప్రతినిధులు తీర్మానించుకున్నారు. నాగబాబు వచ్చే నెలలో మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇంతలోనే రాష్ట్ర పర్యటనలు ముగిసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
* ఎవరి పార్టీ పై వారు ఫోకస్
ఏపీలో( Andhra Pradesh) మూడు పార్టీల కూటమి ఉంది. కూటమి ఐక్యంగా ముందుకు వెళ్తూనే.. ఎవరికి వారుగా పార్టీలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో రికార్డ్ సృష్టించింది. ఏకంగా కోటి మందితో సభ్యత్వం చేసుకుంది. బిజెపి సైతం పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున వైసిపి నేతలను చేర్చుకోవడం ద్వారా బలపడాలని భావిస్తోంది. ఈ తరుణంలో జనసేన సైతం అప్రమత్తం అయ్యింది. ప్రజల్లోకి బలంగా వెళ్లడం ద్వారా తటస్థులను, వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తోంది.
* ప్లీనరీకి సన్నాహాలు
మరోవైపు పిఠాపురంలో( Pithapuram ) జనసేన ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అధికారంలోకి రాగలిగింది. పొలిటికల్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ తరుణంలో ప్లీనరీని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకు భారీగా జన సమీకరణ చేయాలని చూస్తోంది. పవన్ సొంత నియోజకవర్గంలో ప్లీనరీ జరగనుండడంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏలో పవన్ కీలక భాగస్వామి కావడంతో కేంద్ర పెద్దలు సైతం హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దానికి సన్నాహాలుగా నాగబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జనసైనికులు నాగబాబు కొత్త జోష్ నింపే పనిలో పడ్డారు.