Singer Saichand: కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే సందర్భం ఇది. దుఃఖమే దు:ఖపడే నేపథ్యమిది. రాతి మనుషులను కూడా కరిగించే వృత్తాంతం ఇది. నిండా పదేళ్లు కూడా లేని ఆ బాలుడికి తండ్రితో అనుబంధం చాలా ఎక్కువ. అతడి వేలు పట్టుకుని, అతని భుజాల మీద లోకాన్ని చూసి, అతని మాటలు విని పెరుగుతున్న ఆ బాలుడు.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కళ్ళముందే గుండెపోటుతో విలవిలలాడిపోయిన తండ్రిని గుర్తుచేసుకొని కంటికి ధారగా విలపిస్తున్నాడు. నాన్న వస్తాడు, తనతో చెల్లితో కబుర్లు చెబుతాడు. అమ్మతో మాట్లాడుతాడు అనుకొని ఎదురుచూసి చూసి.. ఇక రాడు అని నిర్ధారించుకొని గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తన తండ్రిని మర్చిపోలేక అతని జ్ఞాపకాల్లోనే కన్నీరు ఒలికిస్తున్నాడు. అంతేకాదు తన తండ్రి లేని లోటును అతని చొక్కాలోనే చూసుకుంటున్నాడు. తన తండ్రి వేసుకున్న చొక్కా మీద చేయి వేసి పడుకుంటున్నాడు.
గుండెపోటుతో అకాల మరణం పొందిన తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు సాయి చంద్ ను అతని కుటుంబ సభ్యులు మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా అతని భార్య విలపిస్తున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. ముఖ్యంగా ఆయన పిల్లలు కంటికి ధారగా విలపిస్తున్నారు. తన తండ్రి గుండె పోటుతో అకాల మరణం చెందడం పట్ల తల్లడిల్లి పోతున్నారు. నాన్న నాన్న అంటూ రోదిస్తున్నారు. వారిని ఊరడించడం ఎవరి వల్లా కావడం లేదు. చెట్టంతా కొడుకు కండ్ల ముందే కన్నుమూయడంతో అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి ఖమ్మం లో గుండెపోటుకు గురయ్యాడు. అప్పుడు అతడిని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని వైద్యులు కాపాడారు. తర్వాత గుండె వ్యాధికి సంబంధించిన మందులు ఆయన క్రమం తప్పకుండా వాడుతున్నాడు. మంచి ఆహార నియమాలు పాటిస్తున్నాడు. అయినప్పటికీ అతనికి గుండెపోటు రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాదులో సత్వర చికిత్స అందించే క్రమంలో అకాల మరణం చెందిన పట్ల తెలంగాణ ఉద్యమకారులు దిగ్భ్రాంతిలో కూరుకుపోయారు.
సాయిచంద్ మరణం పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తుంటే.. తమ చానల్స్ వ్యూస్ కోసం నెత్తి మాసిన యూట్యూబర్లు తిక్క తిక్క ప్రయోగాలు చేస్తున్నారు. భర్త చనిపోయి బాధలో ఉందన్న ఇంగిత జ్ఞానం లేకుండా సాయి చందు భార్యను ఇంటర్వ్యూల పేరుతో విసిగిస్తున్నారు. అసలే ఆమె సరిగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉంది. ఇటీవల ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ కోసమని ఆమెను పదేపదే అడగడంతో ఆమె కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆ యూట్యూబర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సాయిచంద్ పిల్లలు అతడి చొక్కాను గట్టిగా పట్టుకుని పడుకోవడం.. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూస్తున్న చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. రాతి గుండెల్లోన కొలువై ఉన్న శివుడా అని పాట పాడిన అతడిని.. శివుడు అంత త్వరగా తీసుకుపోయాడని కన్నీరు ఒలికిస్తున్నారు.