https://oktelugu.com/

Free Bus Effect : మహిళల ఉచిత బస్సు ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి ఆర్టీసీ వినూత్న ప్రయోగం.. సక్సెస్ అవుతుందా?

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.3 వేల కోట్లు చెల్లిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 16, 2024 / 11:40 AM IST

    Women's free bus effect

    Follow us on

    Free Bus Effect : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన పల్లె వెలుగ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. తెలంగాణకు చెందిన మహిళలందరూ వయసుతో సంబంధం లేకుండా 9 నెలలుగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆధార్‌ కార్డు ఆధారంగా కండక్టర్లు స్థానికత నిర్ధారించుకుంటున్నారు. అయితే ఉచిత ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై నెలకు రూ.300 కోట్ల భారం పడుతోంది. ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సెమీ డీలక్స్‌ కేటగిరీ బస్సులను రోడ్డెక్కించింది. ప్రయోగాత్మకంగా మూడు నెలల పాటు ఈ కేటగిరీ బస్సులను తిప్పి ప్రయాణికుల స్పందనను పరిశీలించాలని నిర్ణయించింది. తొలుత నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బస్సులను ప్రారంభించారు. కొత్త బస్సులు సమకూరే కొద్దీ ఇతర జిల్లాలకు పంపనున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌ నగరంలో కొత్తగా మెట్రో డీలక్స్‌ కేటగిరీ బస్సులను ప్రారంభించారు. నగరంలో 125 బస్సులను వివిధ మార్గాల్లో నడపనున్నారు. ఇప్పటికే 24 బస్సులను.. 300, 1 హెచ్, 49ఎం, 3కే, 16ఏ రూట్లలో ప్రారంభించారు.

    అయోమయంలో ప్రయాణికులు..
    ప్రస్తుతం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు కొనసాగుతోంది. నగరంలో ఈ కేటగిరీ బస్సులే ఎక్కువగా ఉంటాయి. మెట్రో లగ్జరీ పేరుతో నడిచే ఏసీ బస్సులు – చూడగానే గుర్తించేలా ఉండటంతో.. మహిళలకు వేటిలో ఉచితం, ఏ తరహా బస్‌ పాస్లు చెల్లుబాటు అవుతాయన్న స్పష్టత ఉంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్‌ బస్సులు కూడా ఎక్స్‌ప్రెస్‌ బస్సులను పోలి ఉన్నాయి. దీంతో మహిళలు అయోమయానికి గురవుతున్నారు. ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్కుతున్నారు. కాదని తెలిశాక దిగిపోతున్నారు. ఈ కేటగిరీ బస్సులపై ప్రచారం లేకపోవటమే దీనికి కారణం. జిల్లాల్లో ప్రారంభమైన సెమీ డీలక్స్‌ విషయంలోనూ ఇదే తరహా గందరగోళం ఏర్పడుతోంది.

    పాత వాటిని కొత్తగా..
    హైదరాబాద్లో రోడ్డెక్కిన మెట్రో డీలక్స్‌ బస్సులు పూర్తిగా కొత్తవి. కంపెనీ నుంచి కొత్త ఛాసిస్‌లు మాత్రమే కొని బస్‌ బాడీని విడిగా తయారు చేయించినవి. కానీ జిల్లాల్లో తిరిగే సెమీ డీలక్స్‌ బస్సుల్లో మాత్రం పాత బస్సులే. ఆర్టీసీ పాతబడిపోయిన రాజధాని బస్సులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. వాటి స్థానంలో కొత్త బస్సులను చేరుస్తోంది. తొలగించిన పాత రాజధాని బస్సుల బాడీ తొలగించి.. వాటి ఛాసిస్‌లపై కొత్తగా సెమీ డీలక్స్‌ బస్‌ బాడీలను ఏర్పాటు చేయిస్తోంది. సాధారణంగా డీలక్స్, ఎక్స్‌ ప్రెస్‌ బస్సులు 10 మీటర్ల పొడవు ఉంటే.. రాజధాని ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. వాటినే సెమీ డీలక్స్‌గా మార్చుతున్నందున.. పొడవుకు అనుగుణంగా సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

    సీట్లు ఎక్కేవే..
    డీలక్స్, ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో 51 సీట్లే ఉంటే.. సెమీ డీలక్స్లలో 59 సీట్లు వస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ తరహాలో సెమీ డీలక్స్‌ బస్సుల్లో 3 ప్లస్‌ 2 పద్ధతిలో సీట్లు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సాధారణ రెగ్జిన్‌ సీట్లు ఉంటే.. సెమీ డీలక్సో్ల ఫ్యాబ్రిక్‌ సింగిల్‌ సీట్లను ఏర్పాటు చేశారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లాగే సెమీ డీలక్స్‌ కనీస చార్జీని రూ.30గానే నిర్ధారించినా.. తదుపరి ప్రతి కిలోమీటర్‌కు 11 పైసల చొప్పున ఎక్స్‌ప్రెస్‌ కన్నా ఎక్కువ చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ 280 డీలక్స్‌ బస్సులను తిప్పుతోంది. అవి లేని మార్గాల్లో సెమీ డీలక్స్‌ బస్సులు తిరుగుతాయి.