Telangana RTC Workers Strike: ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థపై ప్రభావం పడకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. సమ్మె ప్రభావం తగ్గించేలా రవాణాశాఖ విస్తృత ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని అంచనా వేసి ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాంతాల వారీగా ప్రయాణికుల రద్దీని పరిశీలించి అవసరానికి తగ్గట్టుగా వాహనాలను సమకూర్చాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రవాణా అంతరాయం లేకుండా చూడాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఇందులో భాగంగా Regional Transport Office (RTO) అధికారులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ప్రైవేటు డ్రైవర్లు, బస్సులు, వాహనాల వివరాలను సేకరించి వాటిని అవసరానికి అనుగుణంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రోడ్లపైకి దింపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బస్సుల రవాణా ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, వాన్లు, క్యాబ్‌లు వంటి వాహనాలను తాత్కాలికంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఈ వాహనాలను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా పూర్తి చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. GHMC పరిధిలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండే అవకాశమున్నందున ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నారు.
సమ్మె ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మానిటరింగ్ అధికారులను నియమించనుంది. ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి పరిస్థితిని సమీక్షిస్తారు. ఎక్కడైనా రవాణా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసే అవకాశముంది. ఇదే సమయంలో. ప్రజలు అత్యవసర ప్రయాణాలు తప్ప మిగతా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.