ABN RK : కెసిఆర్ మీద ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆయనను రెండుసార్లు ఎన్నుకొని తప్పు చేశారని, పాప ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తాను ముఖ్యమంత్రి అయ్యానని పలుమార్లు చెప్పారు. ఇప్పుడేమో బంగారు తెలంగాణ చేశానని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఎలాగూ బంగారుమయం అయిపోయింది కాబట్టి రాష్ట్రాన్ని పాలించే అవకాశం దళితులకు ఇవ్వాలని ఆర్కే డిమాండ్ చేశారు.
బరాక్ ఒబామా తో పోలికా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఆణిముత్యాల వంటి రెండు మాటలు వెలువడ్డాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నది మొదటి మాట. మనదేశంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలన్నది రెండవది. ఆయన నోటి వెంట ఈ మాటలు వింటున్నప్పుడు ముచ్చటేసింది. ఫక్తు ఫ్యూడల్ లక్షణాలు పునికి పుచ్చుకుని 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని రారాజుగా వెళుతున్న కేసీఆర్లో ఇంత మార్పు రావడం ఆశ్చర్యంగా ఉంటుంది మరి” అని ఆర్కే సూటిగా చెప్పేశాడు.. కెసిఆర్ అనే వ్యక్తి నయా నియంత అని ఆర్కే కుండ బద్దలు కొట్టాడు. బహుశా కేసీఆర్ ను ఇలా తూర్పార పట్టడం ప్రతిపక్ష పార్టీలకు కూడా చేతకాదేమో. ప్రతీ విషయాన్ని ఉదహరించుకుంటూ ఆర్కె తన పెన్నును కేసీఆర్ కు ఎక్కిపెట్టాడు. ” నల్లజాతీయుడు ఒబామా అధ్యక్షుడు అయిన తర్వాత ఆ జాతి చెందిన వారిలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. తెల్లవారి దురాగతాలు కొంతమేర తగ్గాయి. ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందని కేసీఆర్ చెబుతున్నట్టు ఉంది. అంటే అణచివేతకు గురైన వారి చేతికే అధికార పగ్గాలు అందాలన్నది కేసీఆర్ అభిప్రాయం కావచ్చు. తెలంగాణలో దళితుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది. రెండు గ్లాసుల విధానం ఇప్పటికి అక్కడక్కడ అమలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఐదు దశాబ్దాల వెనక్కు వెళితే తెలంగాణలో దళితుల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. దొరల గడిల ముందు నడిచే అర్హత కూడా వారికి ఉండేది కాదు. కాలికి చెప్పులు వేసుకుంటే గుడ్లు ఉరిమి చూసేవారు” అంటూ గత కాలపు పరిస్థితులను ఆర్కే మరొకసారి గుర్తు చేశారు..
కెసిఆర్ లాంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఎలా గెలుస్తారు? అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పడితే దళితుడే సీఎం అవుతాడని చెప్పి తానే సీఎం కావడం ద్వారా అప్పుడూ ప్రజలను ఆయనే ఓడించారు అని ఆర్కే కుండబద్దలు కొట్టారు. 2014 ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? 2014 ఎన్నికల ఖర్చులకోసం అప్పులు కూడా చేసిన కేసీఆర్, 9 సంవత్సరాలు తిరిగేసరికి దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు భరించగల స్థాయికి ఎదగడం తెలంగాణ సమాజాన్ని గెలిపించినట్టా? అని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. అప్పట్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాగా, తెలంగాణ సొత్తును దోచుకుంటున్నారన్న పెద్దమనిషి ఇప్పుడు కబ్జా చేసే అవసరం లేకుండా ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం భూదోపిడి అవ్వదా? అని ఆర్కే ప్రశ్నించారు.2014లో తన ప్రభుత్వాన్ని కూలదోచేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో కలిపేసుకున్నారు. ప్రజల తీర్పునకు అర్థం లేకుండా చేశారు. తద్వారా ప్రజలను ఓడించారు. అప్పుడంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరిగే అవకాశం ఉందని చెప్పి నమ్మించారు. 2018లో ఏ అవసరం వచ్చింది? కెసిఆర్ కు సంపూర్ణ మెజారిటీ లభించింది కదా? అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులను కలిపేసుకున్నారు. మళ్లీ ప్రజల తీర్పును చేరబట్టడం ద్వారా ప్రతిపక్ష సభ్యులను ఎన్నుకున్న ప్రజలను ఓడించారు. ఉమ్మడిగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రశ్నించే గొంతులు ఉండకూడదు అనుకోవడం, ప్రతిపక్షాల అవసరమే లేదని అనడం నిరంకుశత్వం కాదా? అని ఆర్కే ప్రశ్నించారు. ఏ మాటకు ఆ మాట ఇటీవల కాలంలో ఆర్కే ఈ స్థాయిలో తన సంపాదకీయం ద్వారా ఇలా విరుచుకుపడిన సందర్భాలు లేవు. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్షాల బాధ్యతను గుర్తు చేసిన సందర్భాలు కూడా లేవు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు కెసిఆర్ తప్పుల్ని ఎండగడుతూనే, ఇటు ప్రతిపక్షాల బాధ్యతను గుర్తు చేశారు. మొత్తానికి ఆంధ్ర రాజకీయాల ప్రస్తావన లేకపోవడంతో కెసిఆర్ ను రాధాకృష్ణ చెడుగుడు ఆడుకున్నారు.