HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్ పై ప్రతీకారానికి రేవంత్ తుపాకీని సిద్ధంగా ఉంచుకున్నారా?

CM Revanth Reddy: కేసీఆర్ పై ప్రతీకారానికి రేవంత్ తుపాకీని సిద్ధంగా ఉంచుకున్నారా?

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు కాక రేపుతున్నాయి.. నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇవి ఒక ఎత్తయితే.. ఇండియా టీవీ నిర్వహించిన “ఆప్ కీ అదాలత్” కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొక ఎత్తు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను ఆ ఛానల్ విడుదల చేసింది. పూర్తి కార్యక్రమాన్ని యూట్యూబ్ వేదికగా శనివారం రాత్రి నుంచి స్ట్రీమ్ చేయనుంది.. సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలకు మొహమాటం లేకుండా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి రోల్స్ (RRR) పేరుతో ఇండియా టీవీ ప్రసారం చేస్తోంది. వాస్తవానికి ఉత్తర భారత దేశంలో ని మీడియా దక్షిణాది నేతలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వదనే విమర్శలు ఉన్నాయి. కానీ తొలిసారిగా రేవంత్ రెడ్డి ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన బలమైన ముద్రను వేశారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

పెద్దరికం చూపాలి అని మాత్రమే అన్నాను

ఈ ఇంటర్వ్యూలో “రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని కౌకదార్ చోర్ హై అంటారు.. మీరు మాత్రం మోడీ ని బడే బాయ్ అని అన్నారు” అని రజత్ ప్రశ్నించగా..” నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చారు. ఇద్దరం ఒకే వేదికపై కూర్చున్నాం. ప్రధానమంత్రిగా ఆయన దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. నాకు మాత్రమే కాదు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికీ ఆయన పెద్దన్నలాంటివాడు. గుజరాత్ రాష్ట్రానికి గిఫ్ట్ సిటీ ఇచ్చారు. సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మూసి రివర్ ఫ్రంట్ ఇవ్వండి. మా అభివృద్ధికి నిధులు ఇచ్చి పెద్దన్న పాత్రకు సంపూర్ణమైన న్యాయం చేయండి. అని మాత్రమే అన్నానని” రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు..”నరేంద్ర మోడీతో తన భేటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతల మధ్య సమావేశమని.. దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని.. వ్యవస్థలతో నేను పోరాడబోనని” రేవంత్ ప్రకటించారు. “అదానిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మాత్రమే కోరానని.. అంతేతప్ప దోపిడీ చేయాలని కాదని.. తెలంగాణ రాష్ట్రంలో అదానీ దోపిడీ చేస్తే ఊరుకునే రకం నేను కాదని” రేవంత్ స్పష్టం చేశారు.

అప్పుడే కొట్టేవాన్ని

“కెసిఆర్, కేటీఆర్ పై ఆగ్రహం ఉన్నారు కదా.. వారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పట్ల సమీక్ష చేస్తున్నారు కదా.. మీ నిర్ణయం ఎలా ఉండబోతోంది”.. అని రజత్ ప్రశ్నించగా..” నేను కేటీఆర్, కెసిఆర్ ను కొట్టాలి అనుకుంటే ఈ కుర్చీ అవసరం లేదు. అసెంబ్లీలో ఉన్న కుర్చీ చాలు. కానీ నేను వ్యక్తిగతంగా ఎవరితోనూ వైరం పెట్టుకోను. కెసిఆర్ ను సింహం అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. నేను పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయతోను కాలేదు. కెసిఆర్ ను ఆ పార్టీ నాయకులు సింహం అంటున్నారు కాబట్టి.. బయటికి రమ్మని చెప్తున్నా. నేను కూడా తుపాకీ సిద్ధంగా ఉంచుకున్నా. ఒక తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలతో పోరాడే వ్యక్తిని కాదు. నన్ను జైలుకు పంపిన దానికి ప్రతీకారం ఇంకా నేను మొదలుపెట్టలేదు. ఒకవేళ మొదలుపెడితే కథ వేరే విధంగా ఉంటుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా జరగడం లేదు. ఆమె జైలుకు వెళ్లడం మంచిదైందని ఆమె సొంత పార్టీలోని నాయకులే అంటున్నారు. కేటీఆర్ నామీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఆయన సంతోషం మరి రెండు నెలల్లో తేలిపోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐదు సీట్లలో గెలిచేందుకు భారత రాష్ట్ర సమితికి బిజెపి సుపారి ఇచ్చిందని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రజత్ అడిగిన ప్రశ్నలకు.. రేవంత్ చెప్పిన సమాధానాలతో ఆ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈలలు, గోలలతో హడావిడి చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular