CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో పాలమూరు రంగారెడ్డి పై తెలంగాణ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం ఏర్పడేందుకు ప్రధాన కారణం రేవంత్ అని ఇటీవల కెసిఆర్ ఆరోపించారు. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వం తోలు తీస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఆదే స్థాయిలో స్పందించారు. ఇది ఇలా ఉండగానే బనకచర్ల నల్లమల సాగర్ కు సి డబ్ల్యూ సి ఆమోదం తెలిపింది. దీంతో గులాబీ పార్టీ అధికార కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోతుంది. బుధవారం నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో.. చంద్రబాబు పరిపాలన సాగుతోందని ఆరోపించారు.
హరీష్ రావు వ్యాఖ్యలకు గులాబీ పార్టీ అనుకూలమీడియా విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీద అడ్డగోలుగా కథనాలను ప్రచురించింది, ప్రసారం కూడా చేస్తోంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న రేవంత్, కాంగ్రెస్ పార్టీ.. గులాబీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రాపగాండాకు సరైన సమాధానం చెప్పడానికి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
విలేకరుల సమావేశంలో ఎప్పటి మాదిరిగానే రేవంత్ రెడ్డి కేసిఆర్, హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రభుత్వంపై బురద చల్లుతోందని.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. కెసిఆర్, హరీష్ రావు తెలంగాణకు రావలసిన కృష్ణా జలాల్లో ఆనాడు చేసిన సంతకాలే మరణ శాసనంగా మారాయని ఆరోపించారు.. కెసిఆర్ అసెంబ్లీకి వస్తే మొత్తం ఆధారాలతో సహా వివరాలను మొత్తం బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణకు కెసిఆర్, హరీష్ తీవ్ర స్థాయిలో అన్యాయం చేశారని.. వారిని ఉరి తీసినా తప్పులేదని రేవంత్ అన్నారు. నీళ్లు నిజాలపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రేవంత్ మాట్లాడారు.
” నీటి హక్కుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. కృష్ణా, గోదావరి నదుల్లో లభించే నీటిని వాడుకోవడం విషయంలోనే ఇబ్బంది ఎదురవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నాయకులు నాడు మా పార్టీనే ప్రశ్నించారు. కృష్ణా జలాలను తెలంగాణకు 34 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 66% నీటి వాటాలు ఇవ్వడానికి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ ఒప్పుకున్నారు. కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టిఎంసిలు చాలని కెసిఆర్, హరీష్ రావు సంతకాలు చేసింది అబద్ధం కాదు కదా. వారు చేసిన సంతకాలు నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నింట్లోనూ భారత రాష్ట్ర సమితి ఓటమి పాలవుతోంది. అందువల్లే ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని తెలంగాణలో బతికించుకోవడానికి అనవసరమైన జల వివాదాలను సృష్టిస్తున్నారు. అబద్దాల సంఘాలు ఏర్పాటు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాలేశ్వరం వెనుక ఎటువంటి విధానం లేదు. ప్రాజెక్టులు, పంపులు పెంచి కమీషన్లు తీసుకున్నారని” రేవంత్ ఆరోపించారు.
” కమీషన్ల కోసం పాలమూరును మార్చారు. అసలు జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా పరివాహంలోని నీళ్లను పెన్నా పరివాహకంలోకి తరలిస్తోంది. పెన్నా పరిధిలోకి కృష్ణా నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ప్రశ్నించకుండా ఉండిపోయారు. నాడు దోపిడీ బయటికి వస్తుందనే పాలమూరు డి పి ఆర్ రూపొందించలేదు. ఏడు సంవత్సరాల వరకు పాలమూరు డిపిఆర్ సిద్ధం చేయలేదంటే.. కెసిఆర్ పార్టీలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 20,000 కోట్ల కోసం పాలమూరు డిపిఆర్ సిద్ధం చేయలేదు. మేము పక్క రాష్ట్రాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. దానిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అసెంబ్లీలో అన్ని డాక్యుమెంట్లను ముందు పెడతాం” అని రేవంత్ పేర్కొన్నారు…
” ప్రాజెక్టులకు నిధులు సమీకరించడానికి.. అనుమతులు సంపాదించడానికి మాత్రమే ఢిల్లీ వెళుతున్నాను. అక్కడ బలమైన వాదనలను వినిపిస్తున్నాను. కెసిఆర్ కు ఇప్పటికే రాజకీయ సమాధి సిద్ధమైంది. అది తట్టుకోలేక నీటి వాటాల మీద తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పే విషయంలో పోటీ పెడితే కేసీఆర్, హరీష్ రావుకు, కేటీఆర్ కు ఫస్ట్ ప్రైజులు వస్తాయి. కెసిఆర్ అనే వ్యక్తి సభకు రాడు. అందువల్లే బహిరంగ సభలు నిర్వహిస్తానని చెబుతున్నాడు. సభకు వస్తే అన్ని వాస్తవాలు నేను బయట పెడతాను. కెసిఆర్ సభకు వచ్చి కచ్చితంగా మాట్లాడాలి. ఆయన గౌరవానికి భంగం కలిగించే పని మేము చేయుము. వేలకోట్లు ఎవరు దోచుకున్నారు. ఎవరు వీటి వెనుక ఉన్నారు అనే విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్, హరీష్ దుర్మార్గులు. వారిద్దరు చేసిన పాపాలకు ఉరితీసినా తప్పులేదు. మధ్య ప్రాచ్య దేశాలలో కెసిఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులను కచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేవారు. మన దేశం పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి .. చట్టం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని” రేవంత్ పేర్కొన్నారు.
