Revanth Reddy vs KTR: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా స్థానాలను సాధించింది. గులాబీ పార్టీ కూడా సత్తా చూపించింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి, పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు తగ్గట్టుగా స్థానాలు రాకపోవడంతో గులాబీ పార్టీ ఒక రకమైన అసహనంతో కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందువల్లే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దాకా కెసిఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వాతావరణం ఉండేది. ఇప్పుడు కేటీఆర్ ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అరేయ్ ఒరేయ్ అంటూ మాట్లాడుతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా అలానే కౌంటర్ ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేటీఆర్ కు కు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అది కూడా ఆయన అంచనా వేయడానికి అవకాశం లేకుండా షాక్ ఇచ్చారు..
గులాబీ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేయడానికి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ పరిధిలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల గులాబీ పార్టీ మద్దతు తో గెలిచిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను సన్మానించడానికి కేటీఆర్ బుధవారం ఖమ్మం వచ్చారు. 1000 బైకులతో ఆయనకు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదంతా జరుగుతుండగానే గులాబీ పార్టీకి సంబంధించిన మహిళ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈనెల ఐదున ఐదుగురు మహిళా కార్పొరేటర్లు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లలో 12వ డివిజన్ చిరుమామిళ్ల లక్ష్మి, 25వ డివిజన్ గొల్ల చంద్రకళ, 32వ డివిజన్ సరస్వతి, 40వ డివిజన్ అమృతమ్మ, 55వ డివిజన్ మోతారపు శ్రావణి ఉన్నారు. వీరంతా కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ ఘటన నుంచి గులాబీ పార్టీ ఇంకా బయటపడక ముందే.. మరో నలుగురు కార్పొరేటర్లు బుధవారం కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి చెందిన ధనాల రాధా, రుద్ర గాని ఉపేందర్, తోట వీరభద్రం, టూ టౌన్ ఏరియా కు చెందిన మరొక కార్పొరేటర్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ మీద విమర్శలు చేయడానికి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క మీద మండిపడాలని ఖమ్మం వచ్చిన కేటీఆర్ కు.. రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ లను తన పార్టీలోకి చేర్చుకొని.. మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. మరి దీనిని కేటీఆర్ ఏ విధంగా చూస్తారు? ఎలా స్పందిస్తారు? చూడాల్సి ఉంది.