Revanth Reddy comments on collector: ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి. నేతల మధ్య సంబంధాలు కూడా అదే స్థాయిలో ఉండేవి. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలకు ఆస్కారం ఉండేది కాదు. పైగా నేతలు రాజకీయాలను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కొనసాగించేవారు. మిగతా సందర్భాలలో మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇష్టపడేవారు.
ఇప్పటి కాలంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాజకీయాలను వ్యక్తిగత అంశంగా మార్చుకోవడం వల్ల నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటున్నది. వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయ నాయకులు వివిధ వేదికల వద్ద ప్రస్తావించడం.. కుటుంబ సభ్యుల వ్యవహారాలను కూడా బయటపెడుతుండడంతో రాజకీయాలు అంటేనే ఇబ్బందికరంగా మారిపోయాయి. నేతల భాష కూడా అత్యంత దారుణంగా ఉంటున్నది. ఇవన్నీ కూడా నేటి రాజకీయాలలో పతనమవుతున్న విలువలకు దర్పణంగా నిలుస్తున్నాయి. ఇలాంటి రాజకీయాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి.. ఇవన్నీ ఎక్కడ వరకు దారి తీస్తాయి అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
Also Read: KTR కు బిగ్ షాక్.. రేవంత్ పంతం నెరవేరింది
తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ ను కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తే.. దానికి రెట్టింపు స్థాయిలో రేవంత్ కేటీఆర్ ను విమర్శించారు. అంతేకాదు రేవంత్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ భూ అక్రమాలను బయటకు తీశారు. అయితే ప్రభుత్వం నియమించిన ఒక కలెక్టర్ వివాదాస్పదంగా వ్యవహరించడంతో రేవంత్ కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి ఇటీవల ఓ మహిళ ఐఏఎస్ ను సిరిసిల్ల కలెక్టర్ గా నియమించారు.
బుధవారం సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇందులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉండడంతో అది కాస్త చర్చకు దారి తీసింది.. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ చీరలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్ కూడా మాట్లాడారు. అయితే ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి కల్పించుకున్నారు.
Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేలు… తెలంగాణ సీఎంకు కొత్త తలనొప్పి!
“కలెక్టర్ గారు మీకు తెలుగు వచ్చు కదా.. తెలుగులో మాట్లాడండి.. ఇక్కడ మొత్తం మహిళా సంఘాల వారు ఉన్నారు. వారికి కూడా అర్థం కావాలి కదా” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ వీడియో పై గులాబీ నేతలు రకరకాల విమర్శలు చేస్తున్నారు. వాటికి కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.