CM Revanth Reddy: కొద్దిరోజులుగా ఏబీఎన్, ఎన్ టివి మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు చానల్స్ ఒకరి మీద ఒకరు వ్యతిరేక కథనాలను ప్రచారం చేసుకుంటున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంతో ఈ పంచాయతీ మొదలైంది. ఆ తర్వాత ఇందులోకి ఏబీఎన్ వచ్చేసింది.
ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ ఒక అడుగు ముందుకేసి నరేంద్ర చౌదరి మధ్య, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య వ్యాపార సంబంధం ఉందని.. బొగ్గు తవ్వకాలకు సంబంధించి వీరిద్దరి మధ్య సీక్రెట్ వ్యవహారం సాగుతోందని రాధాకృష్ణ రాసుకొచ్చారు. అందువల్లే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇష్టానుసారంగా ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసిందని రాశారు. రాధాకృష్ణ రాసిన ఈ రాతలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. వాస్తవంగా రాధాకృష్ణ లాంటి జర్నలిస్టు ఇలా రాయడం ఒకరకంగా చర్చకు దారి తీసింది.
రాధాకృష్ణ రాసిన ఆ రాతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొచ్చుకున్నారు. వెంటనే విలేకరుల సమావేశం పెట్టి.. రాధాకృష్ణతో నేరుగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు. తాను ప్రజల సంపాదన కాపాడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. వివరణ లేకుండా.. విధానాలు తెలియకుండా రాయకూడదని రాధాకృష్ణకు భట్టి చురకలు అంటించారు.
భట్టి విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం పై స్పందించారు. ఉమ్మడి వరంగల్లో పర్యటిస్తున్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ” మీడియా అధినేతల మధ్య గొడవలు ఉంటే తలుపులు మూసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా మా మంత్రుల మీద పిచ్చిపిచ్చిగా రాస్తే ఊరుకునేది లేదు. ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు రాయాలంటే ముందు నన్ను సంప్రదించాలి. మా మంత్రుల గురించి కథనాలను రాస్తున్నప్పుడు నా వివరణ అడగాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని” రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మీడియా అధినేతలు కొట్టుకుంటే ఇబ్బంది లేదని.. కాకపోతే వారి వ్యక్తిగత విషయాలను ప్రజల మీద రుద్దడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రుల మీద టార్గెట్ చేసినట్టుగా వార్తలు రాయడం జర్నలిజం అనిపించుకోదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి కొద్దిరోజులుగా ఎన్ టీవీ వర్సెస్ ఏబీఎన్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితులు.. రేవంత్ రెడ్డి ఎంట్రీ తో మరింత ముదిరిపోయాయి. మరి ఈ వ్యవహారం ఇంకా ఎక్కడి దాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.
