HomeతెలంగాణBRS: ఐఅండ్ పీఆర్ లో "మిస్టర్ 60%".. యాడ్స్ రాజా 1000 కోట్లు కొల్లగొట్టాడే!

BRS: ఐఅండ్ పీఆర్ లో “మిస్టర్ 60%”.. యాడ్స్ రాజా 1000 కోట్లు కొల్లగొట్టాడే!

BRS: సమాచార, పౌర సంబంధాల శాఖ.. ఒక ప్రభుత్వానికి సంబంధించి అత్యంత కీలకమైనది ఈ శాఖ. ప్రభుత్వ పథకాల నుంచి మొదలుపెడితే.. అమలు తీరు.. పత్రికలకు ప్రకటనలు.. చానల్స్ కు ప్రకటనలు.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం ఈ శాఖ దగ్గరే ఉంటుంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ శాఖలో కొంతమంది తిష్ట వేసుకుని కూర్చున్నారు. పైగా ఆ శాఖను తమ దోపిడీకి రాజమార్గంగా మలచుకున్నారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రచార యావను ఆ శాఖలో పనిచేసే అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఒక అధికారి అయితే యాడ్స్ రూపంలో అడ్డగోలుగా దోచుకున్నారు. మిస్టర్ 60% గా ముద్రపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో గత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

గత భారత రాష్ట్ర సమితి పరిపాలనకు సంబంధించి నిర్వహిస్తున్న సమీక్షల్లో పలు అవకతవకలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ పనితీరుపై శ్వేత పత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవల సమాచార, పౌర సంబంధాల శాఖ పనితీరుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇందులో జరిగిన అవకతవకలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు పౌర సంబంధాల శాఖలో తమకు అనుకూలమైన ఒక వ్యక్తిని కీలక పోస్టులో నియమించి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ శాఖ పని తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ఆరోపణలు చేస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామని అప్పట్లోనే చెప్పింది. అయితే ఈ శాఖకు సంబంధించిన వ్యవహారాలపై నిర్వహించిన సమీక్షలో ఓ అధికారి పనితీరు వెలుగులోకి వచ్చింది. ఆయన డైరెక్టర్ గా వ్యవహరించిన సమయంలోనే కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని తెలుస్తోంది. రెండుసార్లు కేసీఆర్ ఆధ్వర్యంలో కొలువుదీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. భారీగా ప్రకటనలు కుమ్మరించింది. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రకటన నేపథ్యంలో తెలంగాణ మోడల్ అంటూ దేశం మొత్తం ప్రకటనలు ఇచ్చింది. అయితే దీనికి పథకాలు అనే కలరింగ్ ఇచ్చింది. ఇదేమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఆ పథకాల మొత్తం ప్రజలకు చేరాలనే కారణం తోనే ప్రకటనలు ఇస్తున్నామని ప్రకటించింది. పాలకులకు ప్రచార యావ ఉన్న నేపథ్యంలో సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేసే అధికారి దానిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. పైగా ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో అవినీతికి శ్రీకారం చుట్టాడు.
అవుట్ డోర్ మీడియాతో కలుపుకొని గడిచిన 10 సంవత్సరాలలో సుమారు 1000 కోట్ల వరకు పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సొమ్మును అడ్డగోలుగా ప్రచారానికి ఖర్చు చేసి.. దర్జాగా దోచుకున్నారని.. ఇందులో ఓ విశ్రాంత అధికారితో పాటు.. అప్పటి డైరెక్టర్ స్థానంలో ఉన్న ఓ అధికారి కీలకంగా వ్యవహరించాలని ఇప్పటికీ ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఒక ప్రకటన ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖకు చెబుతుంది. అక్కడ ఎం ప్యానల్ చేసుకున్న 20 ఏజెన్సీలు ఉంటాయి. కానీ అక్కడ చక్రం తిప్పింది రెండు ఏజెన్సీలు మాత్రమే. ప్రధానమైన ఐదు పత్రికలకు, న్యూస్ చానల్స్ కు ఎలాగూ రిలీజ్ ఆర్డర్ ప్రకారం ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగతా ఏజెన్సీలకు కూడా పెద్ద ఏజెన్సీల వారే మాట్లాడి ప్రకటనలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏజెన్సీ నుంచి 15% కమిషన్ కామన్ గా ఉంటుంది. అయితే ఫుల్ జాకెట్ ప్రకటనల్లో భారీ బడ్జెట్ ఉంటే పెద్ద ఏజెన్సీలు మాయలు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక్కడే అడ్డగోలుగా కమిషన్లు వసూలు చేస్తూ ఉంటాయి. ఇక చిన్న పత్రికలను, చిన్న చానల్స్ ను అప్పట్లో పనిచేసిన ఓ అధికారి నేరుగా తన కార్యాలయానికి పిలిపించుకునేవారు. ప్రభుత్వం యాడ్స్ ఇవ్వక పోయినప్పటికీ.. తాను కల్పించుకొని ఇస్తున్నానని.. నేను చెప్పిన రేట్ ప్రకారం అయితేనే అవి ఇస్తానని చెప్పేవాడు. అసలే చిన్నస్థాయి పత్రికలు, చానల్స్ కావడంతో ఎంతో కొంత వస్తుందని ఒప్పుకునేవారు. అయితే యాజమాన్యాలకు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నిశ్శబ్దంగానే ఉండేవి. ఇక అధికారి ఆ శాఖలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. పైగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉండడంతో ఆయన ఏకంగా 60% కమిషన్ అధికారిగా పేరుపొందారు. గడచిన పది సంవత్సరాలలో ఆ అధికారి వందల కోట్లకు పడగలెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version