Kaleshwaram Project Repairs: కాళేశ్వరం లో బ్యారేజీల మరమ్మతులు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. అసలు జరుగుతాయో లేదో కూడా అర్థం కావడం లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లో లోపాలు బయటపడ్డాయి. వీటికి మరమ్మతులు చేయడానికి నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. పైగా ఇప్పుడు ఆ సంస్థలు సర్కార్ తోనే న్యాయపోరాటానికి దిగుతున్నాయి.
కాళేశ్వరం లో బ్యారేజీలను నిర్మించారు. అయితే వీటిని రిజర్వాయర్లుగా ఉపయోగించడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిర్మాణ సంస్థలు వాదిస్తున్నాయి. మరోవైపు బ్యారేజీల డిజైన్ల లోనే లోపాలు ఉన్నాయని.. బ్యారేజీలను రిజర్వాయర్లుగా ఉపయోగించడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లోపాలు బయటపడ్డాయని.. మాజీ ముఖ్యమంత్రి నిర్ణయాల వల్ల ఇవన్నీ జరిగాయని వివిధ నివేదికలు బయటపెట్టాయి. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థలు బలంగా వాదిస్తున్నాయి. ” ఇందులో మా బాధ్యత లేదు. మేము చేసిన తప్పు కూడా లేదు. ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెడితే లొంగేది లేదు. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే సుందిళ్ల వరకు మరమ్మతు, పునరుద్ధరణ.. ఇలా ఏ పనులు చేయాలన్నా సరే కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిందేనని” నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం కావడంతో.. దానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కారణమని.. సొంత నిధులతో ఆ బ్యారేజీకి మరమ్మతు చేయకపోతే క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు నోటీసులు కూడా పంపింది. మిగతా బ్యారేజీలు నిర్మించిన సంస్థలకు కూడా ప్రభుత్వం ఇదేవిధంగా నోటీసులు పంపించింది. మేడిగడ్డలో సమస్య తీవ్రత అధికంగా ఉంది. అన్నారం, సుందిళ్ల లో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.. అన్నారంలో గేట్ల నుంచి విడుదలయ్యే వరద విస్తరణకు.. ఇతర రక్షణ చర్యలు తీసుకుంటే బ్యారేజీ పూర్వస్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. సుందిళ్ల ప్రాంతంలో సీ పేజీ కట్టడి చేస్తే బ్యారేజీ వినియోగంలోకి వస్తుంది.
మేడిగడ్డతోనే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. దీనిని నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి.. బ్యారేజ్ కి సంబంధించిన పునరుద్ధరణ వ్యయం మొత్తం ఆ సంస్థ నుంచి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ప్రభుత్వ నియమించిన జస్టిస్ పినాకి చంద్ర గోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దీనికంటే ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే బ్యారేజ్ లు నిర్మించిన సంస్థలు సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మరోవైపు తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.కాళేశ్వరం లో బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని.. సర్టిఫికెట్లు జారీ చేసింది. డిఫెక్ట్ లయబులిటీ కాలం కూడా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. దీంతో నిర్మాణ సంస్థలతోనే బ్యారేజీలకు మరమ్మతులు చేయించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
