HomeతెలంగాణTelangana Assembly Session: శ్వేత పత్రం.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?

Telangana Assembly Session: శ్వేత పత్రం.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?

Telangana Assembly Session: చెప్పినట్టుగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. తెలంగాణ ఆరు లక్షల 70 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేల్చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేనాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉందని.. అది ప్రస్తుతం ఆరు లక్షల 70 వేల కోట్లకు చేరుకుందని విక్రమార్క ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదని.. కాయకల్ప చికిత్స చేస్తే తప్ప ఇది గాడిలో పడదని ఆయన వివరించారు. అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. దానిని బూచిగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అధికారులతో కలిసి అంకెల గారడికి పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ శ్వేత పత్రం తాము రూపొందించలేదని.. అధికారులు చెప్పిన వివరాలను శాసనసభ వేదికగా ప్రజల ముందు ఉంచుతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అధికారులు శ్వేత పత్రం రూపొందిస్తారు. అయితే అంతకంటే ముందే అధికారంలో ఉన్న నాయకులు రూపొందించిన విధానాలను అధికారులు అమలు చేస్తారు.. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగానే నాయకులు పథకాలు రూపొందించడం వల్ల అది అంతిమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. అయితే ఇందులో అధికారులను బాధ్యులు చేయడం ఎంతవరకు సరైనదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికారంలో ఉన్న నాయకులు చెప్పిన మాటలనే అధికారులు పాటిస్తారు. ఒకవేళ ఎదురు తిరిగితే వారిని బదిలీ చేస్తారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణ లోనూ చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు వెల్లడించిన శ్వేత పత్రం సరైన కాదని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అప్పుల్లో లక్షల కోట్ల తేడా ఉందని వారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మరోవైపు గతంలో ఉన్న ప్రభుత్వమేమో తాము అభివృద్ధి కోసమే అప్పులు చేశామని ప్రకటించింది. ఆ అప్పులతో ఆస్తులను పెంచామని చెప్పింది. అయితే అసెంబ్లీ సాక్షిగా లక్షల కోట్లల్లో తేడా కనిపిస్తుండడంతో ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది అంతు పట్టకుండా ఉంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు పాలకులు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుంటారు. అలాంటప్పుడు ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టడానికి అవకాశాలు లేకపోలేదు. అయితే గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇలానే తనకు అనుకూలమైన అధికారులను నియమించుకొని అడ్డగోలుగా అప్పులు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఇక అయితే సమయంలో లక్షల కోట్ల రూపాయలకు లెక్కలు తారు మారు చేసే సత్తా అధికారులకు ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ లెక్కలనే ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ అంచనాలను పెంచటం, లేని రాబడులను వస్తాయని చెప్పడం.. అన్ని పథకాల్లో కోతలు విధించడం గత ప్రభుత్వంలో పరిపాటిగా మారిందని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో లక్షల కోట్ల లెక్కలు తేడా ఉన్న నేపథ్యంలో వాటిని ఎలా భర్తీ చేస్తారనేది అధికారులకే తెలియాలి. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలకు ఉచిత పథకాల ఆశ చూపెట్టి.. అడ్డగోలుగా కేటాయింపులు చేసి.. చివరికి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన పాలకులదే ఈ పాపమంతా. ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు ఆశపడిన ప్రజలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీల ఇచ్చిన ప్రతిపక్షాలకు కూడా ఇందులో భాగం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇలానే కట్టు తప్పితే పోరాడి సాధించుకున్న తెలంగాణ మరో వెనిజులా అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version