Raghunandan Rao : ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా..ఆ పార్టీ అగ్ర నాయకత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అభినందనల వెల్లువ వ్యక్తం అవుతున్నది. తెలుగు నాటకూడా పలువురు రాజకీయ నాయకులు బిజెపి అగ్ర నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం విభిన్నంగా స్పందించారు.. తన ట్విట్టర్ ఐడిలో బిజెపి గెలుపుకు సహకరించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు అంటూ ఒక ట్వీట్ చేశారు.. అంతేకాదు హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మాత్రమే వచ్చిందని ఎద్దేవా చేశారు.
రఘునందన్ రావు కౌంటర్
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో బిజెపి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గడ్డి కౌంటర్ ఇచ్చారు. ” ఢిల్లీ ఎన్నికలకు, కేటీఆర్ కు ఏం సంబంధం? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించారు కాబట్టి అధికారంలోకి వచ్చారు. ఒక పార్టీ నాయకులు.. మరొక పార్టీకి సపోర్ట్ చేస్తే అధికారంలోకి రారు. ఆ విషయం యువరాజు గుర్తుంచుకుంటే మంచిది. 30 మెడికల్ కాలేజీ కట్టే దానికంటే బదులు 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే అధికారంలోకి వచ్చేవారమని కేటీఆర్ అన్నారు. దానిని ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారు. విదేశాల నుంచి ప్రతినెల ₹ 3 కోట్లను సోషల్ మీడియాలో చానల్స్, వెబ్ సైట్స్ కోసం కేటీఆర్ ఖర్చు చేస్తున్నారు. గతం లో టీఆర్ఎస్ ఉండేది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అయింది. ఇప్పుడేమో సీఆర్ఎస్ అయింది. పార్టీలో బావా బామ్మర్దుల మధ్య గొడవ జరుగుతున్నది. ఎవరి దారి వారిది అన్నట్టుగా అందులో పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు మా మీద ఏడుపు ఎందుకు? మా గెలుపును కించపరిచే విధంగా ట్వీట్ చేయడం ఎందుకు? రాజకీయాలలో హుందాతనాన్ని ప్రదర్శించాలి.. అంతేతప్ప ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తే ప్రజలు మరింత తీవ్రంగా తీర్పు ఇస్తారు.. అప్పుడు పార్టీ మొత్తం నాశనం కావడం ఖాయమని” రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీ ఫలితాలు చూసైనా కేటీఆర్ తన వ్యవహరి శైలి మార్చుకోవాలని రఘునందన్ రావు హితవు పలికారు. కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ – బీజేపీ నాయకుల మధ్య కామెంట్ల యుద్ధం సాగింది. నేతలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నారు.