Kakatiya University: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. నిజమేనని తేలడంతో 81 మందిపై వారం రోజులు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది. అయితే వీరంతా విద్యార్థినులే కావడం విశేషం.
యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం జరిగింది. కొంతమంది సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. అది కాస్త వివాదంగా మారింది. యూనివర్సిటీ ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ చేసి మొత్తం 81 మంది విద్యార్థులపై వారం రోజులు పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెన్షన్ కు గురైన విద్యార్థినుల్లో పీజీకి చెందిన వారు 28 మంది, కామర్స్ స్టూడెంట్స్ 28 మంది, ఎకనామిక్స్ చదువుతున్న 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో విద్యార్థుల కోసం ఐదు హాస్టల్స్ ఏర్పాటు చేశారు. కొత్తగా వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన బ్లాక్ వద్ద సెల్ఫ్ డీటెయిల్స్ కార్యక్రమం పేరిట వీక్లీ చేష్టలతో ఏడిపించినట్లు తెలుస్తోంది. దీంతో ర్యాగింగ్ గురైన జూనియర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిజమని తేలడంతో అధికారులు ఆ 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు.