Endowments Department: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదాలలో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే తొలిసారిగా ఆమె ప్రమేయం లేకుండానే ఈసారి ఆమె శాఖలో వివాదం ఏర్పడింది. అది కాస్త ఏకంగా ఉద్యోగుల నిరసనకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కథనాలు మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
కొండా సురేఖ అటవీశాఖ తో పాటు దేవాదాయ శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. దేవదేశాలలో ఇతర విభాగాల అధికారుల వలసలను నివారించడానికి ఆమె డిప్యూటేషన్ల ప్రక్రియను రద్దు చేశారు. గత ఏడాది జూన్లోనే సురేఖ ఆదేశాలు జారీ చేశారు. సొంత శాఖ అధికారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దేవాదాయ శాఖలో ఇతర విభాగాల అధికారులు వలసలు మొదలుపెట్టారని తెలుస్తోంది. సురేఖ ఇచ్చిన ఆదేశాలను సైతం ఉన్నత అధికారులు పక్కన పెట్టారని.. డిప్యూటేషన్లను వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారం దేవాదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
సచివాలయం స్థాయిలో ఈ దస్త్రాలు కదులుతున్నాయని.. ఆలయ కార్య నిర్వహణ అధికారి నుంచి మొదలు పెడితే సహాయ కమిషనర్ వరకు ఇలా అనేక రకాల పోస్టులలో ఇతర విభాగాల వారిని డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సొంత శాఖలో అధికారుల ప్రయోజనాలు కాపాడేందుకు గతంలోనే డిప్యూటేషన్ల ప్రక్రియను రద్దు చేస్తూ మంత్రి సురేఖ నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయాన్ని పక్కనపెట్టి కొంతమంది ఉన్నతాధికారులు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ విభాగాలలో పనిచేస్తున్న వారిని.. దేవాదాయ శాఖలకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సచివాలయం స్థాయిలో దస్త్రాలు కదులుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల జేఏసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంవత్సరాలుగా ఒకే హోదాలో పనిచేసిన తమకు ఉద్యోగ ఉన్నతి కల్పించకుండా.. ఇతర శాఖల సిబ్బందితో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని జేఏసీ ఆరోపిస్తున్నారు. సీనియార్టీ ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించకుండా.. సర్వీస్ రూల్స్ అమలు చేయడం లేదని ఉద్యోగుల జేఏసీ ఆరోపిస్తోంది. కాగా, ముఖ్య కార్యదర్శి నుంచి డైరెక్టర్ కు లేఖ రావడంతో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంత్రి సురేఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
