https://oktelugu.com/

Telugu Media : పైకి విలువలు వల్లించే మీడియా.. లోపల చూస్తే అంతా డొల్ల.. పనిచేసే పరిస్థితులే లేవు..

"విలువలకు పట్టం కట్టాలి. సమాజ హితాన్ని కోరాలి. మీరు రాసే ప్రతి వార్త ప్రజా కోణాన్ని స్పృశించేలా ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా మీరు పని చేయాలి. మీరు ఎలాంటి అంశాన్ని తీసుకున్నా.. అది రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి" ఇవీ ఇటీవల ఆ మీడియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తన సిబ్బందితో చెప్పిన మాటలు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 2, 2024 / 10:09 PM IST
    Follow us on

    Telugu Media : ‘‘ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి. విలువల పాఠాలు గొప్పగా ఉన్నాయి. మరి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా ఉన్నాయా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్పాల్సి ఉంటుంది. ఆ సంస్థ పత్రికను, న్యూస్ ఛానల్ ను నిర్వహిస్తూ ఉంటుంది. ఓ వర్గానికి కొమ్ముకాసే మీడియా సంస్థగా దానికి ఎప్పటినుంచో పేరు ఉంది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆ విషయాన్ని చెప్పుకోవడంలో ఎక్కడా కూడా మొహమాటాన్ని ప్రదర్శించరు. పైగా తన పత్రికలో నేరుగానే విమర్శలు చేస్తుంటారు. తన చానల్ లో గిట్టని వారిపై డ్రమ్ములకొద్దీ బురద చల్లుతూనే ఉంటారు. ఆ తర్వాత కడుక్కోవడం మీ ఖర్మ అని వదిలేస్తూ ఉంటారు. విలువల గురించి గొప్పగా చెప్పే ఆయన.. గొప్ప సమాజం గురించి పదేపదే వల్లె వేసే ఆయన.. తన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి మాత్రం పట్టించుకోరు.. కనీసం ఆయన పత్రిక కార్యాలయాలలో ఉద్యోగులు ఉపయోగించుకోవడానికి మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే తాగడానికి నీరు కూడా అందుబాటులో ఉండదు. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు నరకం చూస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పని చేసే సబ్ ఎడిటర్లు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. “చదువుకున్న చదువుకు బయట ఉద్యోగం దొరకదు. ఇక్కడేమో చాలినంత జీతం ఇవ్వరు. ఖర్మ బాగోలేదు అనుకుని ఉద్యోగం చేస్తుంటే ఇక్కడేమో కనీసం మూత్రశాలలు కూడా ఉండవు. తాగడానికి నీరు కూడా అందుబాటులో ఉండదు.. తిరిగేందుకు ఫ్యాన్ ఉండదు. ఏసీ అన్నా పనిచేయదు.. బిల్డింగ్ పెచ్చులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. అవి ఎవరి మీద పడతాయో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం పూర్వజన్మలో చేసుకున్న పాపం” అని రాత్రిపూట పని చేసే సబ్ ఎడిటర్లు వారిలో వారే మదన పడుతుంటారు.

    2022లో దక్షిణ తెలంగాణలోని ఆ పత్రిక కార్యాలయంలో సబ్ ఎడిటర్ రాత్రిపూట చంపిన విష సర్పం

    పాములు కూడా వస్తుంటాయి..

    ఆ పత్రికకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయం నగరానికి గతంలో దూరంగా ఉండేది. ఆ జిల్లా అంతకంతకు విస్తరించడంతో ఆ కార్యాలయం కూడా నగరంలో ఓ ప్రాంతంగా రూపాంతరం చెందింది. అయితే ఆ కార్యాలయం ఒకప్పుడు ఓ పరిశ్రమకు కేంద్రంగా ఉండేది. దాని చుట్టుపక్కల ఇతర కర్మాగారాలు ఉన్నాయి. పైగా ఆ పత్రికా కార్యాలయ నిర్వహణ అత్యంత అద్వానంగా ఉంటుంది. దీంతో పాములు, ఇతర విష కీటకాలు వస్తూ ఉంటాయి. గతంలో ఒకసారి ఆ కార్యాలయంలోకి ఒక పెద్ద సర్పం వచ్చింది. ఆ సమయంలో ఒక సబ్ ఎడిటర్ అత్యంత చాకచక్యంగా దానిని కర్రతో కొట్టి చంపేశాడు. లేకపోతే భారీ ప్రమాదమే జరిగేది. అయితే ఈ విషయాన్ని ఆ జిల్లా బ్రాంచ్ మేనేజర్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఈ విషయం మేనేజ్మెంట్ దాకా తెలియనీయ లేదు. ఒకవేళ తెలిసినా కూడా మేనేజ్మెంట్ పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే మూత్రశాలలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మేనేజ్మెంట్.. నిర్వహణను మాత్రం ఎలా పట్టించుకుంటుంది.. డబ్బులు మాత్రమే కావాలి.. అత్తెసరు జీతాలు మాత్రమే ఇవ్వాలి.. విలేకరులతో వెట్టు చాకిరీ చేయించుకోవాలనే సిద్ధాంతాన్ని ఆ మేనేజ్మెంట్ పాటిస్తున్నప్పుడు.. జిల్లా కార్యాలయాలు ఇలా కాకుండా ఎలా ఉంటాయి . ఇక్కడే కాదు హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కూడా పరిస్థితి ఇలానే ఉండేదట. అయితే కొంతమంది సబ్ ఎడిటర్లు అక్కడి పరిస్థితులను చూసి ఏకంగా ఉద్యోగాలనే మానేశారట. అయితే ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో సబ్ ఎడిటర్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే.. నవ్వి ఊరుకున్నారట.. అంటే మీ చావు మీరు చావండి అనే అర్థం కదా..

    విలువల గురించి ఎందుకు చెబుతున్నట్టు

    ఉద్యోగులకు గొప్పగా జీతాలు ఇవ్వరు. కార్యాలయాల్లో పనిచేసే పరిస్థితులను కల్పించరు. కనీసం తాగడానికి నీరు కూడా అందుబాటులో ఉంచరు. అలాంటి ఉద్దేశాలు ఉన్న ఆ మీడియా అధినేత సమాజానికి మాత్రం గొప్ప గొప్పగా నీతులు చెబుతుంటారు. అందుకే అంటారేమో చెప్పడానికి మాత్రమే నీతులు.. చేయడానికి ఉత్త చేతులు అని..