Ponguleti Srinivas Reddy : ఆయన విజయవంతమైన వ్యాపారి.. ఆ తర్వాత విజయవంతమైన రాజకీయవేత్త.. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో కారు జోరు కొనసాగుతున్నప్పుడు.. దానిని ఫ్యాన్ గాలి ద్వారా ఆపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవా చూపించారు. ఏకంగా అశ్వరావుపేట, వైరా ఎమ్మెల్యేలను గెలిపించుకొని సంచలనం సృష్టించారు. అంతేకాదు తను కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి రికార్డు సృష్టించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కారులో కూర్చున్నారు. కొంతకాలానికి అందులో నుంచి బయటికి వచ్చారు. హస్తం పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.

ఇప్పుడు వ్యాపారాన్ని కొడుకు చూస్తున్నారు. రాజకీయాన్ని ఆయన చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఎమ్మెల్యే అయిన తొలిసారే ఏకంగా రెవెన్యూ మంత్రి అయ్యారు. అంతేకాదు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖను తీసుకున్నారు. అంతేకాదు కేసీఆర్ మానస పుత్రిక అయిన ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతిని తెరపైకి తీసుకువచ్చారు.. భూభారతి అమల్లో వేగవంతమైన అడుగులు వేస్తున్నారు. తద్వారా రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.. ఇలాంటి క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకసారిగా తన రూట్ మార్చారు.
ఈ మాట అన్నది సాక్షాత్తు ఆయన పార్టీ నాయకులు.. ఆయనను అనుసరించే వ్యక్తులు. సోమవారం తన సొంత నియోజకవర్గమైన పాలేరులో పొంగులేటి పర్యటించారు.. ఈ స్థానంలో గెలిచిన తర్వాత అనేక పర్యాయాలు పొంగులేటి పర్యటించారు. పర్యటిస్తూనే ఉంటారు. అయితే ఈసారి ప్రజలకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తో కలిసి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ముగ్గురు నాయకులు కలిసి పర్యటించారు. వేరువేరుగా పర్యటించారు. అయితే పాలేరు నియోజకవర్గంలో మాత్రం భట్టివిక్రమార్కను ప్రత్యేకంగా ఆహ్వానించారు పొంగులేటి. అంతేకాదు అధికారికంగా భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇది రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.. నాగార్జునసాగర్ లోని ఎడమ ప్రధాన కాలువ కింద అంతర్గత కాలువ పనులను ఇటీవల యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టుకు రెండవ జోన్ ద్వారా భట్టితో కలిసి పొంగులేటి నీటిని విడుదల చేశారు.
అంతర్గత కాల్వపనులను గత రాత్రి మంత్రి పరిశీలించారు. అప్పటికప్పుడు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం కు ఫోన్ చేశారు. తన సెగ్మెంట్ కు రావాలని కోరారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం ఖమ్మం టూర్ లో పాలేరు లో కార్యక్రమం లేదు. మధిరలోని చింతకాని మండలంలో మాత్రమే భట్టి అఫీషియల్ టూర్ డిక్లేర్ అయింది. పొంగులేటి మంత్రి అయిన తర్వాత తొలిసారి భట్టిని తన నియోజకవర్గానికి పిలిపించి అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు పొంగులేటి నియోజకవర్గం లో భట్టి పర్యటించలేదు. వీరిద్దరూ కలిసి అసలు పర్యటించలేదు. అయితే వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం లభించకపోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా భట్టి నిశ్శబ్దంగా ఉంటారు. ఆయన మదిలో ఏ ఆలోచన ఉందా అనేది ఎవరికీ అంతు పట్టదు. ఇక పొంగులేటి కొన్నిసార్లు ఓపెన్ అవుతుంటారు. తన మదిలో ఉన్న ఆలోచనను బయటపెడుతుంటారు.