kumbing
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కొమ్రంభీం – ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దొరికే వరకు పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ఆగేలా లేదు. ఎన్ కౌంటర్ సందర్బంగా కడంబలో జరిగిన ప్రెస్ మీట్ లో ఇంచార్జి ఎస్పీ వి సత్యనారాయణ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసాడు.
Also Read: సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ
మూణ్ణెల్ల క్రితం సుమారు వెయ్యి మంది గ్రే హౌండ్స్ దళాలతో అడెల్లు వేట.. కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు. డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా ఈ వేట కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. జులై 15న ఆసిఫాబాద్ జిల్లా మంగి అటవీ ప్రాంతం “తుక్కు గూడ “వద్ద అడెల్లుకు, గ్రే హౌండ్స్ దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించు కున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి (సెప్టెంబర్ 18న రాత్రి జరిగిన ఎన్కౌంటర్) వరకు… చిక్కినట్టే చిక్కి ఆరు సార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించు కున్నాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం నాటి ఎన్కౌంటర్ కు ముందు, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే “అడెల్లు “మూడుసార్లు తప్పించుకున్నాడని ఇంచార్జి ఎస్పీ వి సత్యనారాయణ చెప్పాడు. ఎన్కౌంటర్ కు ఒకరోజు ముందు చీలాటిగూడ వద్ద పత్తిచేనులో ఉన్న అడెల్లు దళాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయితే, అడెల్లు దళం ఉన్న పత్తిచేనులో రైతులు, చిన్నపిల్లలు కూడా ఉండడంతో… రైతులు, చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని.. పోలీసులు చూస్తూ సంయమనం పాటించి ఏమీ చేయలేక దళాన్ని వెంబడించారని ఇంచార్జి ఎస్పీ సత్యనారాయణ పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే, మరునాటి రాత్రి కాగజ్నగర్ అటవీ ప్రాంతం కడంబ వద్ద కాగజ్నగర్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలకు సాయుధులైన ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వీరిని మావోయిస్టు పార్టీ సభ్యులుగా భావించి లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా పోలీసులపైకి ఆగకుండా కాల్పులు జరిపారని… వీరిని పట్టుకునే పరిస్థితి లేక తమను తాము కాపాడుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారని… గంట సేపు కాల్పులు జరిగాయని ఇంచార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఈ ఫైరింగ్ లో … అడెల్లు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆక్షన్ టీం లోని ఇద్దరు కీలక సభ్యులు మరణించారని, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి కిలోమీటరున్నర దూరంలోనే అడెల్లు ఉండి ఉంటాడని, అతను తప్పించుకునే ఛాన్స్ లేదని ఇంచార్జి ఎస్పీ పేర్కొన్నారు.
అయితే, సాయంత్రానికే అడెల్లు అలియాస్ భాస్కర్ పేరిట మావోయిస్టు ప్రకటన వెలువడింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన చొక్కాలు, బాజీరావ్ లను పట్టుకొని కాల్చిచంపారని ప్రకటనలో ఆరోపించారు. దీంతో అడెల్లు ఎన్కౌంటర్ ఘటన ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గోదావరి దాటి గడ్చిరోలి, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ వైపు తప్పించుకు పోకుండా… కాగజ్నగర్ రూరల్ ఏరియా కడంబ అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత పరివాహక ప్రాంతం చివరకు, చెన్నూరు ఏరియా, కోటపల్లి, నీల్వాయి, దహెగాం, కౌటాల, బెజ్జూరు, గూడెం ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Also Read: జగన్ ను వాడుకుంటున్న కేంద్రం
ప్రాణహిత నదికి ఆవలివైపున గడ్చిరోలి సరిహద్దులోని భామిని, రేగుంట, సిరొంచ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ పోలీసులను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. దీంతో అక్కడి బలగాలు ప్రాణహితకు ఆవలి ఒడ్డున పొజిషన్ తీసుకొని ఉన్నాయి. అడెల్లు తప్పించుకోకుండా…సుమారు 40 కిలో మీటర్ల మేర భద్రతా బలగాలు రెండంచెల వలయంగా ఏర్పడి చుట్టుముడుతున్నాయి.
ఏం చేసినా, అడెల్లుకు తప్పించుకొనే అవకాశం ఇవ్వవద్దనే పట్టుదలతో పోలీసులున్నట్టు సమాచారం. కొమ్రం భీం – ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఎస్పీలు కూంబింగ్ ఆపరేషన్ ను మానిటరింగ్ చేస్తున్నారు. ప్రాణహిత నదీపరివాహక ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల గిరిజనులు కూంబింగ్ ఆపరేషన్తో భయం భయంగా గడుపుతున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Police searh for bhaskar in telangana border
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com