Hyderabad: ఒంటరిగా ఉంటున్న ఓ 82 ఏళ్ల వృద్ధురాలు తనకు తోడుగా ఉంటుందని ఓ అపరిచిత మహిళకు తన ఇంట్లోనే ఒ గది అద్దెకు ఇచ్చింది. అయితే ఆ మహిళ పక్కింటి యువకుడితో కలసి ఘోరానికి పాల్పడింది. వృద్ధురాలిని చంపేసి 23 తులాల బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు.
స్వగ్రామంలో ఒంటరిగా..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరుకు చెందిన సంరెడ్డి సత్తెమ్మ(82) స్వామిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సత్తెమ్మ భర్త స్వామిరెడ్డి గతంలోనే మరణించారు. పెద్ద కుమాడురు బాల్‌రెడ్డి వనస్థలిపురంలో.. చిన్న కుమారుడు గోపాల్‌రెడ్డి అమెరికాలో స్థిరపడగా.. సత్తెమ్మ స్వగ్రామంలోని ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. నగరంలోని బొల్లారంలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద ఎనిమిది రోజులపాటు ఉంది. ఈనెల 3న రాత్రి శంషాబాద్‌లో సత్తెమ్మ పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి వియ్యంకుడు, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైంది. ఆ రాత్రి వనస్థలిపురంలోని పెద్ద కుమార్తె ఇంటికెళ్లింది. ఆదివారం ఉదయం అక్కడి నుంచి తొర్రూర్‌లోని ఇంటికి వచ్చింది.
భారీగా బంగారు ఆభరణాలు చూసి…
పెళ్లికి వెళ్లిన సమయంలో సత్తెమ్మ భారీగా ఆభరణాలు వెసుకుంది. ఇది గమనించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళకు దుర్బుద్ధి పుట్టింది. ఆదివారం రాత్రి వరకు ఆరుబయటే కూర్చుని ఇరుగుపొరుగుతో సత్తెమ్మ ముచ్చటించింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు స్థానికుడొకరు సత్తెమ్మ ఇంటికి వచ్చి తలుపుకొట్టగా స్పందనలేదు. పక్కనుండే మరో తలుపు నుంచి లోపలికి వెళ్లిచూడగా.. పడకగదిలోని మంచంపై సత్తెమ్మ విగతజీవిగా పడి ఉంది. గుర్తుతెలియని దుండగులెవరో ఆమెను హత్యచేసి ఒంటిపైనున్న నగలన్నీ దోచుకున్న విషయాన్ని స్థానికులు సత్తమ్మ పెద్ద కుమారుడు బాల్‌రెడ్డికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ సాయిశ్రీ, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తెలిసినవారే చేసి ఉంటారని అంచనాకు వచ్చారు.
విచారణలో విస్తుపోయే వాస్తవాలు..
చుట్టుపక్కల వారిని పోలీసులు వాకబు చేయగా, సత్తెమ్మ ఇంటి మరో గదిలో లలిత(34) అనే మహిళ ఉంటున్నట్లు చెప్పారు. ఆమెపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా మరో నిందితుడు ఎండ్ల రాకేశ్(28)తో కలిసి తాను చేసిన దారుణాన్ని బయటపెట్టింది. నారాయణ్‌పేట జిల్లా దామరగిద్దకు చెందిన ఎండ్ల రాకేష్ ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతని అన్న తొర్రూరులో సత్తెమ్మ ఇంటి ముందు ఇల్లు నిర్మిస్తుండటంతో పనులు చూసేందుకు తరచూ వచ్చేవాడు. సత్తెమ్మ ఇంట్లో ఉంటున్న లలితతో పరిచయం పెంచుకున్నాడు. అది వివాహేతర సంబంధంగా మారింది. ఊరెళ్లేటప్పుడు నిలువెల్లా నగలతో సత్తెమ్మ కనిపించడంతో రాకేశ్‌కు ఆశపుట్టింది. లలితతో ఈ విషయమై పథకం వేశాడు.
పథకం ప్రకారం హత్య..
ఆదివారం రాత్రి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. లలిత సత్తెమ్మ కాళ్లు పట్టుకోగా.. రాకేశ్ గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం తమకేమీ తెలియనట్లు ఇద్దరూ జనం మధ్యలోనే ఉండటం విశేషం. నిందితురాలు లలిత స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని నగలు స్వాధీనంం చేసుకున్నారు.