Phone Tapping Case KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చుట్టూ బిగిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం కెసిఆర్ ను విచారించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. దీనిపై సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలకంగా భేటీ అయ్యారు. కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. ఈనెల 29న సుప్రీంకోర్టు లో స్టేటస్ రిపోర్టు దాఖలు చేస్తారని సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం నాడు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. అప్పట్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాదు, ఒక ఆడియో కూడా విడుదల చేశారు. అయితే ట్యాపింగ్ వల్లనే ఈ ఆడియో బయటికి వచ్చిందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆడియోను ఎలా రికార్డ్ చేశారు? ఎక్కడి నుంచి వివరాలు సేకరించారు? అనే విషయాలను పోలీసులు రాబట్టారని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు , సహా ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కెసిఆర్ ను సిట్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. నాడు కెసిఆర్ ఆరోపించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను పోలీసులు గురువారం విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నందకుమార్ ఫోన్ ను ట్యాప్ చేయడం ద్వారానే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నాడు కేసీఆర్ గుర్తించారని సిట్ భావిస్తోంది.
అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం.. మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను కూడా ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు.. ఇతరులకు నోటీసులు ఇస్తుందని సమాచారం. నడు బిజెపి నేతలను అడ్డంగా ఇరికించడానికి కేసీఆర్ ఆడియో టేపులను బయటపెట్టారు. అవే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చాయని పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.