Nirmal: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలో ఫార్మసిటీ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ఇటీవల కలెక్టర్‌తోపాటు, అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు. అయితే రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా.. అధికారులనే లగచర్ల గ్రామంలోకి రప్పించుకున్నారు. గ్రామంలోకి వెళ్లిన అధికారులపైకి తిరగబడ్డారు. భూములు ఇచ్చేది లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తరిమి కొట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కలెక్టర్‌పై ఓ మహిళ చేయి కూడా చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికారులపై దాడిచేసిన, విధులకు ఆటంకం కలిగించిన రైతులు, నాయకులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రైతులను రెచ్చగొట్టిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం జైల్లో ఉన్నారు. ఈ ఘటన ఇంకా మర్చిపోకముందే.. నిర్మల్ జిల్లాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది.
లగచర్చ స్ఫూర్తితో..
సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్ల గ్రామ రైతులనుంచి స్ఫూర్తి పొందిన నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గుండంపల్లి రైతులు మంగళవారం(నవంబర్ 26న) సడెన్‌గా జాతీయ హదారి దిగ్బంధం చేపట్టారు. బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు.. దానిని నిరవధికంగా మార్చాలని ప్రయత్నించారు. తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగింది. దిలావర్‌పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన తీవ్ర స్థాయికి చేరింది. ఫ్యాక్టరీ వల్ల దీర్ఘకాలంలో తమ పంటపొలాలు దెబ్బతింటాయని, కాలుష్యం కారణంగా తమ ఊళ్లల్లోనూ ఇబ్బందులు ఎదురవుతాయని దిలావర్‌పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి గ్రామాలతోపాటు సమీపంలోని టెంబరేణి, లోలం, బన్సపల్లి తదితర గ్రామాలూ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం బంద్ పాటించడంతోపాటు దిలావర్‌పూర్ మండలకేంద్రంలో బస్టాండ్ వద్ద 61వ జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. నిర్మల్–భైంసా రహదారిపై దాదాపు 12 గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఆర్డీవో నిర్బంధం..
ఉదయం నుంచి రాస్తారోకో కొనసాగుతుండడంతో నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. రాస్తారోకో విరమించాలని, కలెక్టరేట్‌కు 20 మందిని తీసుకెళ్లి కలెక్టర్ మాట్లాడిస్తానని చెప్పారు. కానీ రైతులు వినిపించుకోలేదు. తమకు స్పష్టమైన హామీ ఇక్కడే ఇవ్వాలని పట్టుపట్టారు. కలెక్టరే తమవద్దకు రావాలంటూ ఆర్డీవో వాహనాన్ని అడ్డుకుని, ఆమెను ఘెరావ్ చేశారు. ఆర్డీవో అలాగే తన వాహనంలో నాలుగైదు గంటలపాటు కూర్చుండిపోయారు. చివరకు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎస్పీ జానకీషర్మిల స్వయంగా రోప్‌పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీవోను ఆమె వాహనంలో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేశారు. వాహనంపై చలిమంటల్లోని నిప్పులను వేశారు. ఇదే క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడటంతో ఆమె చాలాసేపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. గంటలపై వాహనంలో ఉండిపోవడంతో ఆర్డీఓ రత్నకల్యాణికి సైతం బీపీ తగ్గడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
భారీ బందోబస్తు..
బంద్‌తోపాటు ఆందోళన చేయొచ్చన్న ముందస్తు సమాచారం మేరకు నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల అప్రమత్తమయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్‌జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.
ఆది నుంచి వద్దంటూనే..
దిలావర్‌పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు సమీపంలో దాదాపు 40 ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తిచేశారు. రూ.వందలకోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్ అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ.. సమీపంలోని దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాలు ముందునుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గత ఏడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేసేవరకూ వెళ్లింది. అప్పటి నుంచీ తమ గ్రామాల్లో దీక్షలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: People of 4 villages protested on nirmal bhainsa road
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com