Konda Surekha: ఓ వ్యక్తికి పర్యావరణం అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. పచ్చని చెట్లు అంటే పట్టరాని ప్రేమ ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఓ సంస్థ చేస్తున్న దుర్మార్గం తెలుస్తుంది. అతడు న్యాయ పరంగా ముందుకు వెళ్తాడు. అనేక మందిని కలుస్తాడు. సంచలన విషయాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అతడికి ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం తెలుస్తుంది. ఆ తర్వాత అతడు తన పోరాటాన్ని మార్చుకుంటాడు. చివరికి విజయం సాధిస్తాడు.. చదువుతుంటే పాతకాలం నాటి సినిమా గుర్తుకు వస్తోంది కదా.. సేమ్ ఇలాంటి స్టోరీ దక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో ఉన్న చోటుచేసుకుంది. అయితే ఓ పర్యావరణ ప్రేమికుడు చేసిన ఉద్యమాన్ని ఇక్కడ కొండా సురేఖ మాజీ ఓఎస్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బెదిరింపులకు పాల్పడి చివరికి దొరికిపోయాడు.
సూర్యాపేట జిల్లాకు చెందిన పసుపులేటి సురేష్ అనే వ్యక్తి పర్యావరణ ప్రేమికుడు. ఇతడు గత దశాబ్ద కాలంగా అనేక సిమెంట్ కంపెనీలలో సివిల్ ఇంజనీర్ గా పనిచేశాడు. ఇటీవల కాలంలో దక్కన్ సిమెంట్స్ లో ఉద్యోగంలో చేరాడు. అయితే అతడికి పర్యావరణం అంటే చాలా ఇష్టం. పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. తాను పనిచేస్తున్న దక్కన్ సిమెంట్స్ దాదాపు వందల ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్టు గుర్తించాడు. కంపెనీ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అతని ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కీలకమైన ఆధారాలు సేకరించాడు. ఆ ఆధారాలను తన దగ్గర పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, మైన్స్ ఏడీఈ కి ఫిర్యాదు చేశాడు. అందరితోనే అతడు ఆగలేదు జిల్లా అటవీ శాఖ అధికారి, కేంద్ర పర్యావరణ శాఖ, అటవీశాఖ మంత్రులకు ఫిర్యాదు కూడా చేశాడు.
అతడు కంపెనీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో సుమంత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తన ఫిర్యాదు పై న్యాయం చేయాలని అతడు ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుగా తిరుగుతుంటే.. ఫిర్యాదును అడ్డం పెట్టుకొని సుమంత్ కంపెనీని డబ్బులు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని సురేష్ మీడియా ప్రతినిధులు ఎదుట పేర్కొన్నాడు… “నేను వెన్ను చూపించకుండా పోరాటం చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాను. నా ఫిర్యాదును అడ్డం పెట్టుకొని సుమంత్ డబ్బులు డిమాండ్ చేయడం నిజంగా దారుణం. అయినప్పటికీ నేను నా పోరాటాన్ని ఆపను. త్వరలోనే సిబిఐ, ఈడీ అధికారులను కలుస్తాను. నా దగ్గరున్న ఆధారాలు మొత్తం వారికి సమర్పిస్తాను. దక్కన్ సిమెంట్ పరిశ్రమ చేస్తున్న దుర్మార్గాన్ని బయటపెడతానని” సురేష్ వెల్లడించాడు.