Panchayat Election Update : తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసి పది నెలలు గడిచింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. సమస్యలు పేరుకుపోతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లు సవరించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బీసీ గణన కూడా చేపట్టింది. గణన పూర్తయింది. ఆన్‌లైన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తారని చాలా మంది భావించారు. ఈమేరకు వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ సబ్‌కమిటీ తిరస్కరించింది. నిబంధన కొనసాగిస్తూ.. పంచాతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
మార్పు లేకుండా సవరణ బిల్లు..
ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు. అంతకన్నా ఎక్కువ మంది ఉంటే అనర్హులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనను మార్చాలని, ఈమేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదన చేర్చాలని చాలా మంది కోరారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్‌ను ఆదేశించింది. దీంతో నిబంధన మార్చకుండానే శాసన సభలో గురువారం(డిసెంబర్ 20న) పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ దానికి ఆమోదం తెలిపింది.
1994 నుంచి నిబంధన..
కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 1994లో ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అన్హులని చట్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నవారికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈమేరకు కొంత మంది మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఈమేరకు చట్ట సవరణ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని కూఆ చేరారు. కానీ, దీనికి మంత్రి మండలి ఆమోదం తెలుపలేదు. రాష్ట్రంలో సంతానోత్పత్తిపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో చట్ట సవరణ బిల్లులో సంతానం నిబంధన అంశాన్ని చేర్చలేదు. పాత నిబంధననే కొనసాగిస్తూ బిల్లు ప్రవేశ పెట్టారు.
విలీనానికి ఆమోదం..
ఇక చట్ట సవరణ ద్వారా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో 80 గ్రామాల విలీనానికి సైతం ఆమోదం లభించింది. వికారాబాద్ జిల్లా పరిగి, మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు, సమీప గ్రామాల విలీనం, మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఏర్పాటుకు సమీప గ్రామ పంచాయతీల విలీనం, కరీంనగర్ నగరపాలక సంస్థ విస్తరణ, గ్రామాల విలీనం, మంచిర్యాల నగర పాలక సంస్థ ఏరాపటు, సమీప గ్రామాల విలీనం. నార్సింగి మున్సిపాలిటీలో జన్వాడ పంచాయతీ విలీనం, శంషాబాద్ నగరపాలికలో శంకరాపురం పంచాయతీ విలీనం ప్రతిపాదన ఆమోదం పొందాయి.