NTV attack on Andhra Jyothi: ఆదివారం నాటి ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన సంపాదకీయం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాధాకృష్ణ రాసిన రాతలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం పెట్టారు. నేరుగా వేమూరి రాధాకృష్ణతో తేల్చుకుంటామని సవాల్ విసిరారు.
ఇంతటితోనే ఈ ఎపిసోడ్ ఆగడం లేదు. రాధాకృష్ణ రాతల మీద ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి నేరుగా స్పందించకపోయినప్పటికీ.. అటు వైసిపి, ఇటు గులాబీ పార్టీ నాయకులు ఆయనకు అనుకూలంగా స్పందిస్తున్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయితే ఏకంగా రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. “నీ పత్రిక కార్యాలయం కాలిపోతే కెసిఆర్ పరామర్శించడానికి వచ్చారు. కనీసం ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేకుండా పోయింది. అడ్డగోలుగా రాతలు రాస్తున్నావు. ఎవరిని మెప్పించడానికి ఈ రోత రాతలు అంటూ” మండిపడ్డారు.. ఇక వైసిపి కూడా అదే స్థాయిలో రాధాకృష్ణ మీద విమర్శలు చేస్తోంది. ఒక వ్యక్తి కోసం రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నాడని.. అవన్నీ కూడా త్వరలోనే బయటపెడతామని వైసిపి నేతలు పేర్కొంటున్నారు.
మొత్తంగా రాధాకృష్ణ రాసిన సంపాదకీయంలో టిడిపి, కాంగ్రెస్ లోని ఓ వర్గం ఆంధ్రజ్యోతికి సపోర్ట్ గా ఉండగా.. ఎన్ టివి కి వైసిపి, బీఆర్ఎస్ బాసటగా నిలిచాయి. కొద్దిరోజులుగా ఎన్టీవీ వైసీపీ, గులాబీ పార్టీ నేతల విలేకరుల సమావేశాలకు విపరీతంగా ప్రయారిటీ ఇస్తోంది. ముఖ్యంగా రాధాకృష్ణను విమర్శించే నాయకుల వార్తలకు కవరేజ్ ఇస్తోంది. దీనినిబట్టి ఎవరు ఏ పక్షమో తెలుగు ప్రేక్షకులకు మరోసారి క్లారిటీ వచ్చింది. అయితే ఈ వివాదం ఇంకా ఎక్కడ దాకా దారితీస్తుంది? రాధాకృష్ణ ఎలాంటి బాంబులు పేల్చబోతున్నారు? దానికి ఎన్టీవీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? ఈ ప్రశ్నలకు త్వరలో సమాధానాలు లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
