Journalists: మొన్ననే మనం చెప్పుకున్నాం కదా పాత్రికేయమనేది సమాజం కోసం పనిచేయడం లేదని.. దండాలకు, దౌర్జన్యాలకు మాత్రమే దీనిని కొంతమంది వినియోగించుకుంటున్నారని.. దానిని నిరూపించే సంఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకంగా మూడు చోటుచేసుకున్నాయి.. గత ఏడాది చివర్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ పత్రికా విలేకరి, ఓ యూట్యూబ్ లో చేసే వ్యక్తి ఎంత దారుణానికి పాల్పడ్డారో మనం చెప్పుకున్నాం. కానీ, దానికి మించిన సంఘటనలు నిజామాబాద్ నగరంలో చోటుచేసుకున్నాయి.
ఏకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి లంచాలు ఇవ్వాలని పదిమంది వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఇందులో ఓ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ కూడా ఉండడం విశేషం. నిజాంబాద్ లోని రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ యాజమాన్యం నుంచి ఏకంగా 10 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా డబ్బులు వసూలు చేసిన వారిలో ఓ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ అంజీ, మరో పత్రిక బ్యూరో హెడ్ విజయ్, ఫోటోగ్రాఫర్, ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ దివాకర్, ఓ పత్రిక రిపోర్టర్ గోపాల్.. ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీరందరూ డబ్బుల కోసం రియాన్స్ కాలేజ్ మేనేజ్మెంట్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో.. ఆ కాలేజీ నిర్వాహకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించిన పోలీసులు వారందరిపై కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ నగరంలో లక్ష్మీ అమృత ఆస్పత్రిలో ఒక మహిళ చనిపోయింది. అయితే ఆ వ్యవహారంలో ఓ పత్రిక విలేకరులు రంగ ప్రవేశం చేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ను తీవ్రంగా బెదిరించారు. డబ్బులు డిమాండ్ చేయడంతో.. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో.. పోలీసులు ఆ విలేకరులపై కేసులు నమోదు చేశారు.
మరోవైపు నిజామాబాద్ నగరంలో ఓ మీడియా సంస్థకు సంబంధించిన ఇద్దరు విలేకరులను రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆ పత్రిక ఎడిటర్ రామకృష్ణ, రిపోర్టర్ ఉన్నారు. వీరిలో ఆ పత్రికా ఎడిటర్ కు బెయిల్ వచ్చింది. రిపోర్టర్ రిమాండ్ లోనే ఉన్నాడు. నిజామాబాదులోని ఓ ఐ టి ఐ కళాశాల మైదాన సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడు. అతడు ఎండు గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అతడిని పట్టుకొని.. 210 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే అతడిని పోలీసులు విచారించగా తనకు ఓ పత్రికా ఎడిటర్, రిపోర్టర్ సహకరిస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. ఇందులో ఆ పత్రికా ఎడిటర్ కు బెయిల్ లభించింది.
వాస్తవానికి ఈ సంఘటనలు సమాజంలో పాత్రికేయం ఏ స్థాయిలో దిగజారి పోతుందో నిరూపిస్తున్నాయి. ఇటువంటి వారి వల్ల స్వచ్ఛంగా పనిచేసే పాత్రికేయులు విమర్శల పాలవుతున్నారు. యాజమాన్యాలు సరిగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల.. మీడియా సంస్థల లో పనిచేసే విలేకరులు ఇలా అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. చివరికి ఇలా పోలీసులకు చిక్కి.. జైలు పాలవుతున్నారు.
