Vehicle Registration: మనం ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేస్తే.. దానిని రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆర్టిఏ కార్యాలయానికి వెళ్తాం. దానికంటే ముందు స్లాట్ బుక్ చేసుకుంటాం. అనంతరం ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లి.. సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఇది ఇప్పటివరకు ఉన్న విధానం. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది వాహనదారులకు ఉండదు. ముఖ్యంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.
శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈనెల 8న దీనికి సంబంధించి ప్రభుత్వం విధానపారమైన నిర్ణయాన్ని తీసుకుంది. అధికారులు దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించారు. అనేక అడ్డంకులను అధిగమించిన తర్వాత.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ సంయుక్త రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నూతన విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం రవాణా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాహనం అమ్మిన డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తారు. రవాణా శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఉదయం వాహనం కొనుగోలు చేస్తే.. సాయంత్రానికి శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఒకవేళ ఆ వాహనాన్ని సాయంత్రం కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ మాత్రం మరుసటి రోజు పూర్తవుతుంది.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం ఇన్ వాయిస్, ఫారం 21, ఫారం 22, ఇన్సూరెన్స్, అడ్రస్ ప్రూఫ్, వెహికల్ ఫోటోలను డీలర్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాడు. రవాణా శాఖ అధికారి ఆ దరఖాస్తు మొత్తాన్ని పరిశీలించి.. రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ స్పీడ్ పోస్ట్ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి వెళ్తుంది. శాశ్వత రిజిస్ట్రేషన్లకు సంబంధించి అవసరమైతే వాహనాలను తనిఖీ చేస్తామని.. డీలర్ల షోరూంలోకి వెళ్లి వాహనాలను పరిశీలిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం కేవలం బైక్, కార్లకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ యధావిధిగా ఆర్టీవో కార్యాలయాలలోనే జరుగుతూ ఉంటుంది.