Navy Radar Station: ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా దామగుండం ప్రాంతంలో నేవీ వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ను నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేంద్రం నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం తల ఊపడం విస్మయాన్ని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో వుడ్ సైడ్ ఒమేగా అనే వీఎల్ ఎఫ్ రాడార్ ను 2015లో అక్కడి ప్రభుత్వం బాంబులు పెట్టి పేల్చివేసింది. అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఎన్ఏఏ అర్లింగ్టన్ రాడార్ , మేరీ ల్యాండ్ లోని అన్న పోలీస్ ఎన్ఎస్ఎస్ రాడార్ ను పడగొట్టింది. స్థానికులు, పర్యావరణ వేతల నుంచి విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం ఈ పని చేసింది. సాంకేతికంగా సమస్యలు కూడా ఎదురవుతుండడం వల్ల ప్రభుత్వం వాటిని పడగొట్టింది. రాడార్ ఇన్ స్టా లేషన్ తో చోటు చేసుకున్న పరిణామాలు స్థానికుల ఆరోగ్యాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిజంగా ప్రమాదమేనా?
వీఎల్ఎఫ్ రాడార్ అనేది.. వెరి లో ఫ్రీక్వెన్సీ రాడార్ అని అర్థం. దీని ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాములలో ఉన్న సిబ్బందితో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవచ్చు.. రాడార్ వ్యవస్థ వల్ల త్రీ కేజీహెచ్ నుంచి 30 కేజీహెచ్ జెడ్ వరకు తరంగాలు ప్రసారమవుతాయి. నీటిలో అయితే 40 m లోతు వరకు ఈ తరంగాలు ప్రసరిస్తాయి. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా ఇవి సంకేతాలను చేరవేరుస్తాయి.. విఎల్ఎఫ్ అనేది ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాల మిశ్రమం. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, సంతానోత్పత్తిపై ప్రభావం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది పరిశోధనల ద్వారా తెలుస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
2,500 కోట్లతో నిర్మాణం
ఈ రాడార్ స్టేషన్ ను 2,500 కోట్ల వ్యయంతో ఈస్టర్ నావెల్ కమాండ్ నిర్మిస్తోంది. 2027 వరకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీని నిర్మాణం వల్ల మూసినది కాలగర్భంలో కలిసిపోతుందని ఇప్పటికే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పర్యావరణవేత్తలతో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ప్రతిపాదన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని గుర్తు చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మించేందుకు నేవీ గతంలోనే ప్రతిపాదించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2,901 ఎకరాలను నేవీ కి అప్పగించింది. రాడార్ ఏర్పాటు పూర్తయితే.. అందులో పని చేసే సిబ్బంది స్థానికంగా ఉండేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో 600 మంది దాకా పనిచేస్తారని తెలుస్తోంది. వాళ్లు ఉండడానికి గృహాలను నిర్మిస్తారు. బ్యాంకులు, ఆసుపత్రులు, మార్కెట్లు వంటి వాటివి ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. సుమారు 27 కిలోమీటర్ల పరిధిలో అత్యంత పటిష్టమైన గోడ నిర్మిస్తారు. దాదాపు రెండున్నర వేలమంది నివాసం ఉండేలాగా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తానని తెలుస్తోంది.