Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ మంజూరైన మూడు నెలలు దాటినప్పటికీ ఆమె ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇకదాంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా అన్న ప్రచారం జరిగింది. బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆమె సైలెంటుగానే ఉండిపోయారు. కొన్ని అనారోగ్య కారణాలు, సరైన సమయం కోసం చూశారని ఆమె అభిమానులు చెప్పుకొచ్చారు. కానీ.. ఆమె రాజకీయాలకు దూరం అయ్యేందుకు సిద్ధంగా లేరని, బీఆర్ఎస్‌తో కాకుంటే సొంతంగా రాజకీయం చేస్తానంటూ తెరమీదకు వచ్చారు.
జైలు నుంచి విడుదలయ్యాక మూడు నెలల తరువాత ఎమ్మెల్సీ కవిత ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇది ఒక విధంగా తీపిలాంటి వార్తే. అయితే.. ఆమె వచ్చీరాగానే జాగృతి నేతలతో భేటీ అయ్యారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో ఆమె పూర్తిగా ఇక నుంచి పూర్తిగా జాగృతి తరఫునే ప్రజల మధ్యన ఉండాలని డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా అదానీ విషయంలో నిలదీసిన కవిత.. ఆ వెంటనే జాగృతి నేతలతో భేటీ అయ్యారు. వారితో కులగణన అంశంతోపాటు మరికొన్ని రాజకీయ అంశాలను చర్చించారు. ఈ సమావేశాన్ని కూడా జాగృతి ముఖ్యనేతలతో నిర్వహించినట్లుగా తెలిసింది.
ఇక నుంచి కవిత బీఆర్ఎస్ నీడలో కాకుండా.. సొంతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తుననాయి. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్ కు గురైన హాస్టల్ విద్యార్థులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. అయితే.. కవిత వారితోపాటు వెళ్లలేదు. తనతోపాటు కొంత మంది జాగృతి నేతలను వెంటపెట్టుకొని ఆమె పరామర్శకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కానీ.. ఆ స్పీచులో కూడా ఎక్కడా బీఆర్ఎస్ పేరు ఎత్తలేదు. అదే సందర్భంలో ప్రభుత్వంపై మాత్రం ఆమె విరుచుకుపడ్డారు. ఇక ఇప్పటికే కవిత భారత జాగృతిని కాస్త తెలంగాణ జాగృతిగా మార్చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసేందుకు ఆమె సిద్ధం అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన విషయంలోనూ ఆమో ప్రభుత్వానికి పలు డిమాండ్లు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వేను కూడా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అయితే.. ఇవి అన్నీ కూడా జాగృత తరఫున డిమాండ్ చేసినట్లుగానే కనిపించింది. ఎక్కడా కూడా ఆమె నోట ఇంతవరకు బీఆర్ఎస్ పేరు వినిపించలేదు. ఆమె బీఆర్ఎస్‌కు దూరం కావడం వెనుక కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న టాక్ నడుస్తోంది. అందుకే ఆమె భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ గొడుగు కిందకు చేరుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సందర్భంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. కేవలం ఎన్నికల వరకే జాగృతితో ప్రజల్లో ఉంటారని, ఎన్నికల వేళ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారని కూడా తెలుస్తోంది. ఏదిఏమైనా కవిత ప్రజల్లోకి వచ్చిందన్న సంబరం ఒకవైపు అయితే.. ఆమె బీఆర్ఎస్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న వేదన ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది.