MLC Balmuri Venkat: తెలంగాణ–ఏపీ రాష్ట్రాలుగా విడిపోయినా.. రాజకీయంగా, బంధుత్వాల పరంగా కలిసే ఉంటున్నాయి. గడిచిన పదేళ్లలో ఏపీలో టీడీపీ, వైసీపీ అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ గతంలో టీడీపీని తెలంగాణ నుంచి పంపించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ ఏపీ ప్రజల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్తో స్నేహంగానే ఉంది. ప్రజలు కూడా కలిసి మెలిసే ఉన్నారు. కానీ, తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణపై అక్కసు వెల్లగక్కడం రాజకీయంగా రచ్చ రేపుతోంది.
దిష్టి తగిలిందని కించపరుస్తూ..
ఏపీలోని కోనసీమకు దిష్టి తగిలిందని, అదీ తెలంగాణ దిష్టి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవి రెండు రాస్ట్రాల మధ్య చిచ్చు రేపాయి. ఐదు రోజులుగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండి పడుతున్నారు. మొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తెలంగాణ ప్రజలకు, ఏపీలో కోన సీమకు ఏమిటి సంబంధం అని నిలదీశారు.
తెలంగాణ నుంచి వెళ్లిపోవాలన్న బల్మూరి..
ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏపీ డిప్యూటీ సీఎంపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. పవన్ సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరించి ఆదాయం ఇస్తుంటే.. ఇక్కడే ఉంటే.. ఇక్కడే ఆస్తులు కూడబెట్టుకున్న పవన్.. తెలంగాణను కించపర్చేలా మాట్లాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే ఆస్తులు అమ్ముకుని తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. గతంలో టీడీపీ నేతలు కూడా ఇంత దారునంగా మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలను కించపర్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పవన్ తీరును తప్పు పడుతున్నారు. అయినా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం లేదు. కనీసం స్పందించడం లేదు. మరి ఈ రాజకీయం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
ఇంత నీచంగా TDP వాళ్ళు కూడా తిట్టి ఉండరు pic.twitter.com/dPKB9hA0zk
— (@2029YSJ) December 2, 2025