Miss England Quits Miss World: 75వ మిస్ వర్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ బ్రాండ్‌ను మరింతగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు హైదారబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించింది. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో 20 రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అందగత్తెలు హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. అయితే ఈ పోటీలకు వచ్చిన మిస్ ఇంగ్లండ్ అర్ధంతరంగా పోటీల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు చెప్పి వెళ్లిపోయిన ఆమె.. తర్వాత పోటీలపై, భారత్‌పై ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ 2024, మిల్లా మాగీ(24) పోటీ నుంచి తప్పుకుంది. మే 7న హైదరాబాద్‌లో పబ్లిసిటీ కార్యక్రమాల కోసం వచ్చిన మాగీ, మే 16న ‘వ్యక్తిగత కారణాల’తో నిష్క్రమించారు. అయితే, లండన్ వెళ్లిన తర్వాత బ్రిటిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పోటీ నిర్వాహకులు తనను ‘ప్రదర్శన కోతుల్లా’ చూశారని, ధనవంతులైన స్పాన్సర్లను సంతోషపెట్టడానికి ‘వేశ్యలా’ భావించేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. 74 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో మిస్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ పోటీ నుంచి వైదొలగడం ఇదే మొదటిసారి. ఈ ఆరోపణలు పోటీ నిర్వహణ, మహిళల గౌరవం, ఆధునిక విలువలపై ప్రశ్నలను లేవనెత్తాయి.
ఊహించని ఒత్తిడి, గౌరవలోపం
మిల్లా మాగీ కార్న్‌వాల్‌కు చెందిన లైఫ్‌గార్డ్. సర్ఫర్, ప్లస్ జైజ్ మోడల్ అంటే కాస్త బొద్దుగా ఉండే మోడల్ అన్నమాట. సాధారణంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేవారంతా జీరో సైజ్ ఉంటారు. కానీ, అలాగే ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నలు చాలాకాలంగా మిస్ వర్డ్ కాంటెస్ట్ నిర్వాహకులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బొద్దుగా ఉన్న మిస్ ఇంగ్లండ్‌కు మిస్ వరల్డ్ పోటీల్లో అవకాశం ఇచ్చారు. లైఫ్‌గార్డ్‌గా మిల్లా మాగీ సీపీఆర్ అవగాహన కోసం ‘గో ఫార్ విత్ సీపీఆర్’ క్యాంపెయిన్‌ను నడిపారు. ఈ క్యాంపెయిన్‌కు ప్రిన్స్ విలియం సైతం మద్దతు ఇచ్చారు.
అవకాశం ఇవ్వలేదని..
బ్రిటన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీలో తన సామాజిక కార్యక్రమాలను చర్చించే అవకాశం లభించలేదని, అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. స్పాన్సర్లతో కలిసి డిన్నర్‌లలో ‘వినోదం’ కోసం ఒత్తిడి చేశారని ఆమె తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు భారీ మేకప్, ఈవెనింగ్ గౌన్లు ధరించాలని, ధనవంతులైన స్పాన్సర్లను ఆకర్షించేందుకు టేబుల్స్‌కు కేటాయించారని ఆమె వెల్లడించారు. ఈ అనుభవాలు ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ నినాదానికి విరుద్ధమని, పోటీ 1960–70ల విలువల్లోనే ఉన్నదని ఆమె విమర్శించారు.
తగ్గుతున్న ఆదరణ..
వాస్తవంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ పోటీలకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, లారా దత్తా, సుష్మితాసేన్ లాంటివారు పోటీల్లో గెలిచి నిలిచారు. అయితే ప్రస్తుతం అందం అంటే ఏమిటి అనే నిర్వచనానికి సరైన అర్థం లేకపోవడం, మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు పెట్టిన ప్రమాణాలే అందం అంటే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఈ పోటీలకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఈ తరుణంలో 75వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ, మిల్లా మాగీ చేసిన ఆరోపణలు ఇప్పుడు పోటీలకు మచ్చలా మారాయి.
పోటీ నిర్వహణపై ప్రశ్నలు..
మాగీ ఆరోపణలు మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ, మహిళల పట్ల వ్యవహార శైలిపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరుగుతున్న పోటీకి, తెలంగాణ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా పరాభవంగా మారింది. మిస్ వరల్డ్ నిర్వాహకులు మాగీ ఆరోపణలను ‘తప్పుడు, అవమానకరం’గా తోసిపుచ్చి, ఆమె తల్లి ఆరోగ్య సమస్య కారణంగా వైదొలిగారని పేర్కొన్నారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో మాగీ నిర్ణయాన్ని అనేకమంది సమర్థిస్తున్నారు, బ్యూటీ పేజెంట్లలో ఆధునికీకరణ అవసరమని వాదిస్తున్నారు. మాగీ స్థానంలో మిస్ లివర్‌పూల్, ఛార్లెట్ గ్రాంట్ (25), ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వివాదం బ్యూటీ పేజెంట్లలో నీతి, గౌరవం, పారదర్శకతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.