https://oktelugu.com/

Medaram Jatara: మేడారం వెళ్లే వీఐపీలకు మంత్రి సీతక్క కీలక సూచన!

సోమవారం నుంచే మేడారంలో భక్తుల సందడి మొదలైంది. మంత్రి సీతక్క కూడా సోమవారం జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 15 రోజులుగా మేడారానికి విపరీతమైన భక్తులు వస్తున్నారన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 20, 2024 / 08:16 AM IST
    Follow us on

    Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వెళయింది. మరో 48 గంటల్లో(ఫిబ్రవరి 21న) మేడారం జాతర మొదలు కాబోతోంది. అదేరోజు సారలమ్మ తల్లిని కోయ పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. దీంతో జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే జాతరకు లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్లారు. శని, ఆదివారాల్లో అయితే 3 నుంచి 5 లక్షల మంది వరకు వచ్చారు. ఇక జాతర వేళల్లో కనీసం రోజుకు 50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ జాతర కోసం రెండు నెలలుగా ఏర్పాట్లు జరిగాయి.

    సందడి షురూ..
    ఇదిలా ఉంటే.. సోమవారం నుంచే మేడారంలో భక్తుల సందడి మొదలైంది. మంత్రి సీతక్క కూడా సోమవారం జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 15 రోజులుగా మేడారానికి విపరీతమైన భక్తులు వస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జాతర నిర్వహిస్తామని ప్రకటించారు. భక్తులు క్రమశిక్షణతో వచ్చి అమ్మవార్లను దర్శించుకుని వెళ్లాలని సూచించారు. వీఐపీ పాస్‌ల కోసం అధికారులపై ఒత్తిడి వస్తోందని తెలిపారు.

    ఎవరైనా బస్సుల్లోనే రావాలి..
    ఇక భక్తులతోపాటే వీఐపీలు కూడా ఈసారి మేడారానికి బస్సుల్లోనే రావాలని సీతక్క సూచించారు. గతంలో కేవలం 2 నుంచి 3 వేల బస్సులు నడిపేవారని, ఈసారి 6 వేల బస్సులు నడుపుతున్నామన్నారు. వీఐపీ వాహనాలు, బస్సులు ఒకే రూట్‌లో రావడం వలన ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని తెలిపారు. మేడారం గద్దెల వరకు బస్సులు వస్తాయన్నారు. అందుకే వీఐపీలు కూడా బస్సుల్లో రావాలని కోరారు. వాహనాల్లో వచ్చే వీఐపీలు తాడ్వాయి, ఏటూరునాగారం, లేదా ములుగు వద్ద తమ వాహనాలు నిలిపి ఆర్టీసీ బస్సుల్లోనే అమ్మవార్ల దర్శనానికి రావాలని తెలిపారు. ఆర్టీసీ బస్సు రూట్‌ సులభంగా ఉందని, అందరూ సహకరించాలని కోరారు.

    కొన్ని గంటలే..
    ఇదిలా ఉంటే మేడారం జాతరకు మరి కొన్ని గంటల సమయమే ఉంది. ఆదివారం నుంచే భారీగా భక్తులు మేడారం తరలి వస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ విపరీతంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ ఆదివారం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మంగళవారం నుంచి బస్సులు కూడా కిటకిటలాడతాయని అంచనా వేస్తున్నారు. ఈసారి మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలో 6 వేల బస్సులు కూడా చాలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సీతక్క వీఐపీలు కూడా బస్సులో రావాలని సూచించడం మంచిదే అయినా.. బస్సుల్లో వీఐపీలు ఎక్కితే.. సామాన్యులు ఇబ్బంది పడతారని పలువురు పేర్కొంటున్నారు.