Lok Sabha Elections 2024: పొంగులేటిపై పోటీనా? షాకిచ్చిన వియ్యంకుడు.. అసలేం జరిగింది

వాస్తవానికి ఈ పార్లమెంట్ స్థానంలో మొదటి నుంచి కూడా స్థానికేతరులు విజయం సాధించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామానికి చెందినవారే.

Written By: Anabothula Bhaskar, Updated On : April 24, 2024 8:20 am

Lok Sabha Elections 2024

Follow us on

Lok Sabha Elections 2024: రాజకీయాలు ఇలానే ఉండాలని లేదు. ఇలానే ఉంటేనే వాటిని రాజకీయాలు అని చెప్పడానికి లేదు. ఏ క్షణమైనా అవి మారతాయి. ఎలాంటి టర్న్ అయినా తీసుకుంటాయి. అందుకే రాజకీయాలలో “రాజీ”కీయాలు ఉంటాయి.. రాజ”కయ్యాలు” కూడా ఉంటాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో..రాజ”కయ్యాలను చూడాల్సి వస్తోంది. అయితే ఇవి ఎవరో బయట వ్యక్తుల మధ్య అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ సొంత పార్టీ నాయకుల మధ్య మధ్య ఇటువంటి పోటీ ఏర్పడటం రాజకీయ వైచిత్రికి తాజా నిదర్శనం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. రేపు లేదా మాపు ప్రకటిస్తారనే ఉత్కంఠ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కొనసాగుతూనే ఉంది.

ఈ ఉత్కంఠకు ఇంకా తెరపడకముందే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ వేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రఘురామిరెడ్డి తరఫున పొంగులేటి అనుచరులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఎంపీ సీటు కోసం తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ తన సతీమణికి టికెట్ ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ హై కమాండ్ ముందు సరికొత్త డిమాండ్ పెట్టారు. భట్టి డిమాండ్ అలా ఉంటే.. తన తమ్ముడికి టికెట్ ఇవ్వాల్సిందేనని, ఒకవేళ ఇవ్వని పక్షంలో తన వియ్యంకుడు రఘురామిరెడ్డికి కేటాయించాలని శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దల ఎదుట పట్టుపట్టినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అది అలా ఉండగానే రఘురామిరెడ్డి నామినేషన్ వేయడం.. తెర వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పడం.. వంటి పరిణామాలతో ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డిప్యూటీ సీఎం విక్రమార్కకు చెక్ పెట్టేందుకే పొంగులేటి ఇలాంటి సరికొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి ఈ పార్లమెంట్ స్థానంలో మొదటి నుంచి కూడా స్థానికేతరులు విజయం సాధించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామానికి చెందినవారే. పైగా ఈ ప్రాంతం ఆంధ్రకు దగ్గరగా ఉంటుంది. అక్కడి సంస్కృతి ఎంతో కొంత ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో స్థానికేతర అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. మండవ వెంకటేశ్వరరావు పేరును కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నాయకులు వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు. అయితే మండవ వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలా?! ఇస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో ఉన్నారు. ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోయినప్పటికీ.. కమ్మ లేదా రెడ్డి సామాజిక వర్గం వారికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. బుధవారం అభ్యర్థి విషయంలో ఒక ప్రకటన చేస్తుందని సమాచారం.