Minister Konda Surekha: సమంత – నాగచైతన్య విడాకుల వెనక కేటీఆర్ ఉన్నాడని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు సమంత తన విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. తన విడాకుల వ్యవహారాన్ని వార్తల హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవద్దని నాగచైతన్య చురకలాంటించారు. అక్కినేని అమల సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి తగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక ప్రకటన చేశారు..” నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలపై ఒక నాయకుడు చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. సమంత మనోభావాలను నేను దెబ్బతీసే వ్యక్తిని కాదు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. ఆమె అంటే నాకు కూడా అభిమానమే. నేను చేసిన వ్యాఖ్యల పట్ల సమంత లేదా ఆమె అభిమానులు మనస్థాపానికి గురైతే.. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నానని” సురేఖ పేర్కొన్నారు. మరోవైపు సురేఖ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో అక్కినేని కుటుంబం, పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే చూస్తూ ఉండబోమని.. మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ను వదిలేది లేదు
సురేఖ చేసిన ప్రకటనలోనూ కేటీఆర్ పై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఆయనకు మహిళల పట్ల చిన్న చూపు ఉందని పేర్కొన్నారు. ఆ ధోరణిని ప్రశ్నించడానికే ఆమె ఆ వ్యాఖ్యలు చేసినట్టు ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం నిమిత్తం సురేఖ వెళ్లారు. ఆ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో నేత కార్మికులు రూపొందించిన నూలు పోగు దండను ఆమెకు బహుకరించారు. దీనిని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు అని చెబుతున్న కొంతమంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దానికి వక్ర భాష్యాలు చెప్పారు. ఈ సంఘటన పట్ల మంత్రి సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. దీని వెనక కేటీఆర్ ఉన్నారని ఆమె భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖకు భారత రాష్ట్ర సమితి నుంచి టికెట్ దక్కక పోవడానికి కారణం కేటీఆర్ అని అప్పట్లోనే సురేఖ ఆరోపించారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని వారు వివరిస్తున్నారు.