https://oktelugu.com/

Minister Sridhar Babu: దుద్దిళ్ల.. ఎక్కడికో ఎదిగిపోయాడు!

గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోల కాంగ్రెస్‌ పార్టీ విజయంలోనూ శ్రీధర్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ ఇన్‌చార్జి హోదాలో పార్టీని యాక్టివ్‌ చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 29, 2024 4:02 pm
    Minister Sridhar Babu

    Minister Sridhar Babu

    Follow us on

    Minister Sridhar Babu: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్‌ పార్టీలో మరో కీలక పదవి దక్కింది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే పాంచ్‌ న్యాయ్‌ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా మెజారిటీ సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ రాష్ట్రానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ జాతీయ మేనిఫెస్టో కమిటీ తెలంగాణ చైర్మన్‌గా శ్రీధర్‌బాబును నియమితులయ్యారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, సభ్యులుగా శ్యాంమోహన్, కమలాకేరారావు, బీఎం వినోద్‌కుమార్, రియాజ్, జనక్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

    మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా..
    కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో అధ్యయనం చేస్తుంది. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజలకు ఎలా చేస్తే లబ్ధి చేకూరుతుంది, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఎలా గెలవాలి, మేనిఫెస్టో ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. 15 రోజుల్లో కమిటీ తుది నివేదికను అధిష్టానానికి ఇస్తుంది.

    కర్ణాటకలోనూ పార్టీని అధికారంలోకి తెచ్చి..
    గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోల కాంగ్రెస్‌ పార్టీ విజయంలోనూ శ్రీధర్‌బాబు కీలక పాత్ర పోషించారు. ఏఐసీసీ ఇన్‌చార్జి హోదాలో పార్టీని యాక్టివ్‌ చేశారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు ఐదు గ్యారంటీల రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. గుల్బర్గా జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో ఏఐసీసీ అధ్యోఉడు మల్లికార్జునఖర్గేతో కలిసి ప్రచారం చేశారు. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లాంటి దిగ్గజ నేతల సొంత రాష్ట్రంలో అందరినీ కలుపుకుపోవడంతో శ్రీధర్‌బాబు పార్టీ విజయానికి కృషి చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి టిక్కెట్ల పంపిణీ, ప్రచారాల్లో సమన్వయం వంటివన్నీ శ్రీధర్‌బాబు దగ్గరుండి చూసుకున్నారు. ఇక పార్టీ అగ్రనాయకులు అయిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సభలను విజయవంతం చేయడంలోనూ తనవంతు పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ ఎక్కడ అనే వారి నోళ్లు మూతపడేలా కాంగ్రెస్‌ను కర్ణాటకలో అధికారంలోకి తీసుకువచ్చారు.

    తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా..
    కర్నాటకలో శ్రీధర్‌బాబు పనితీరును గమనించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఇక్కడ కూడా శ్రీధర్‌బాబు సక్సెస్‌ఫుల్‌గా పనిచేశారు. ఆరు గ్యారంటీలతోపాటు, ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టో రూపొందించడంతో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, కౌలు రైతులకు పెట్టుబడిసాయం, ఇలా అనేక అంశాలను మేనిఫెస్టోలో చేర్చడంలో శ్రీధర్‌బాబు కీలకంగా వ్యవహరించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన ఆలోచన కూడా శ్రీధర్‌బాబు చేసిందే.

    ఇప్పుడు జాతీయ పదవి..
    సౌత్‌ ఇండియాలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పనితీరు మెచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం తాజాగా జాతీయ మేనిఫెస్టో కమిటీ తెలంగాణ చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు జాతీయస్థాయిలో మరింత గుర్తింపు దక్కినట్లయింది.

    సీఎంలకన్నా ఎక్కువ ప్రాధాన్యం..
    ఇదిలా ఉండగా శ్రీధర్‌బాబు వివాద రహితుడు, తనకు అప్పగించిన పనిని చేసుకోపోవడంలో దిట్ట. వ్యూహ రచనల్లోనూ ఆరితేరారు. సైలెంట్‌గా సక్సెస్‌వైపు పయనించే నేత. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీఎం స్థాయి నేతలను కూడా కాదని, శ్రీధర్‌బాబుకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా జాతీయ పదవి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్‌నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో సీఎం కూడా అవుతారని శ్రీధర్‌బాబు అభిమానులు పేర్కొంటున్నారు.