Tollywood :అక్కినేని కుటుంబం పై సానుభూతి సరే.. అప్పట్లో మౌనం ఎందుకు?

ఒక కాకికి కష్టం వస్తే మరో కాకి ఆర్తనాదాలు చేస్తుందంటారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు అటువంటి కష్టమే వచ్చింది. చిత్ర పరిశ్రమ యావత్ అండగా నిలిచింది. మరి గతంలో ఇదే చిత్ర పరిశ్రమ మెగా కుటుంబంపై మాటల దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ కి అవమానం జరిగినప్పుడు ఎందుకు నోరు తెరవలేదు.

Written By: Dharma, Updated On : October 4, 2024 10:56 am

Tollywood

Follow us on

Tollywood : తెలంగాణలో మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య మధ్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపిస్తూ చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినీ పరిశ్రమ వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఎక్కువ మంది ఖండిస్తున్నారు. అన్ని వర్గాల ప్రముఖులు, సాధారణ ప్రజలు సైతం సురేఖ చేసిన వ్యాఖ్యలను సమర్ధించడం లేదు. అన్ని వర్గాల వారు అక్కినేని కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. టాలీవుడ్ అంతా ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకోవడంతో మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం సురేఖ తీరుపై నిప్పులు చెరిగారు. వారు వీరు అనే తేడా లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నాగార్జున కుటుంబానికి సన్నిహితంగా ఉన్నట్లు, ఇతర ఆర్టిస్టులు ఖండించారు. మంత్రి కొండా సురేఖ తీరుపై తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఇది చాలా మంచి పరిణామం. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ తరహాలో తిప్పి కొట్టడం అనేది ఆహ్వానించదగ్గదే. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పై చాలాసార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు తోటి సినీ వ్యక్తులు. ఒకరిద్దరు వైసీపీ నేతలు సైతం అప్పట్లో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

* ఎన్టీఆర్ కుమార్తె పై అనుచిత వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో కొందరి నేతల తీరు అభ్యంతరకరంగా ఉండేది. శాసనసభలో ఏకంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఆమె నందమూరి తారకరామారావు కుమార్తె. ఎన్టీఆర్ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమ.. తెలుగు చిత్ర పరిశ్రమ అంటేనే ఎన్టీఆర్. ఇలా పెనవేసుకుపోయింది వారి బంధం. అటువంటి ఎన్టీఆర్ కుమార్తెకు ఘోర అవమానం జరిగితే ఒక్కరంటే ఒక్కరు.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు స్పందించలేదు. నందమూరి కుటుంబం బాధపడినా ఓదార్చేందుకు ముందుకు రాని పరిస్థితి అప్పట్లో ఉండేది. పైగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు కూడా చేయూతనందించారు. కనీసం ఆ విషయాన్ని గుర్తించి కూడా ఎవరు స్పందించలేదు. కనీసం మాట్లాడలేదు.

* చిరంజీవి మాతృమూర్తి పేరుతో
గత ఐదేళ్లుగా పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోని వైసిపి నేతలేరు. ప్రారంభంలో చిరంజీవి అంటే అభిమానం ప్రదర్శించిన వారు సైతం.. ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పకోడీ గాళ్లు అంటూ ఎగతాళిగా మాట్లాడారు. మరికొందరైతే అంజనాదేవి పేరును ప్రస్తావిస్తూ కూడా తిట్ల దండకం అందుకున్నారు. కానీ ఆ సమయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సినీ పరిశ్రమ నుంచి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మీరు చేస్తున్నది తప్పు అని చెప్పలేదు. కేవలం అప్పట్లో ప్రేక్షకపాత్ర మాత్రమే పోషించారు. పవన్ పై పోసాని కృష్ణ మురళి ఏకంగా తిట్ల దండకమే అందుకున్నారు. అప్పుడు ఆయన తెలుగు చలనచిత్ర అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయినా సరే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఒక్కరు కూడా స్పందించలేదు.

* ఆ భయంతోనే
అయితే ఇప్పుడు నాగార్జున కుటుంబం పై సానుభూతి చూపిస్తున్నారు. దీనిని తప్పు పట్టలేము కానీ.. ఇదే మనుషులు అప్పుడు ఎక్కడికి వెళ్లారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అప్పట్లో తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉండేవారు. ఏపీలో సీఎం గా జగన్ ఉండేవారు. చిత్ర పరిశ్రమ అంతా హైదరాబాదులో ఉండేది. కెసిఆర్ తో జగన్ స్నేహం కొనసాగించేవారు. అందుకే అప్పట్లో వైసీపీ నేతల తీరుపై చిత్ర పరిశ్రమ వ్యతిరేకించేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే చిత్ర పరిశ్రమ వ్యక్తులు స్వేచ్ఛగా స్పందిస్తున్నారు. అయితే అప్పట్లోనే వైసీపీ నేతల విషయంలో కఠినంగా వ్యవహరించి ఉంటే.. మంత్రి కొండా సురేఖ ఉదంతం అనేది జరిగి ఉండేది కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.